అప్పుడు నార్లు.. ఇప్పుడు పైర్లు!.. చలి తీవ్రతో చనిపోతున్న వరి చేన్లు

అప్పుడు నార్లు.. ఇప్పుడు పైర్లు!.. చలి తీవ్రతో చనిపోతున్న వరి చేన్లు
  • తెగుళ్లు, వైరస్​ సోకి ఎర్రగా మారుతున్న పంట
  •  రూ.వేలల్లో మందులకు ఖర్చు.. ఫలితం శూన్యం
  •  ఆందోళనలో రైతులు 

మహబూబ్​నగర్, వెలుగు : ఈ ఏడాది కురిసిన భారీ వర్షాలతో మహబూబ్​నగర్, నారాయణపేట జిల్లాల్లోని చెరువులు, కుంటలు నిండుకుండల్లా మారడంతో పాటు భూగర్భ జలాలు కూడా గణనీయంగా పెరిగాయి. దీనికి తోడు రాష్ట్ర ప్రభుత్వం సన్న వడ్లకు ప్రకటించిన బోనస్ కూడా తోడవడంతో, ఈ యాసంగి సీజన్‌‌‌‌‌‌‌‌లో రైతులు రికార్డు స్థాయిలో సాగు చేపట్టారు. వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారం గత వానాకాలంలో ఈ రెండు జిల్లాల్లో 3.60 లక్షల ఎకరాల్లో వరి సాగు కాగా, ఈసారి అది ఏకంగా 4 లక్షల ఎకరాలకు చేరింది. అయితే, కొద్ది రోజులుగా చలి తీవ్రత వరి పంటపై తీవ్ర ప్రభావం చూపుతోంది. వరి చేన్లు దెబ్బతింటుండటంతో, ఎంతో ఆశతో సాగు చేపట్టిన రైతులు ఇప్పుడు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

ఇదీ పరిస్థితి.. 

ఈ యాసంగిలో వరి రైతులు గత నవంబరు చివరి వారం నుంచి నార్లు పోసుకున్నారు. నార్లు ఎదిగే కాలం 25 రోజుల నుంచి 30 రోజులు. కానీ తీవ్రమైన చలి ప్రభావం వల్ల నార్లు 45 రోజుల నుంచి 50 రోజులకు పెరిగాయి. ఈ నార్లనే రైతులు నాటుకున్నారు.  మరికొందరు మళ్లీ నార్లు పోసుకొని నాట్లు పెట్టుకున్నారు. అయితే నాటుకొని 40 నుంచి 50 రోజులు కావస్తున్నా ఇంత వరకు పైర్లు పెరుగుతలేవు. గిడసబారిపోయాయి. పిలకలు కూడా రావడం లేదు. నాట్లు ఎలా వేశారో, అలాగే ఉన్నాయి. ఒక దంటు పెడితే ఇప్పటి వరకు ఆ దంటుకు 30 నుంచి 40 పిలకలు రావాలి. అలా పిలకలు వస్తేనే వాటికి కంకులు ఏర్పడి దిగుబడి వస్తుంది.

కాని పిలకలు రాకపోవడం రైతుల్లో ఆందోళన కలిగిస్తోంది. కొద్ది రోజులుగా తెల్లవారుజామున ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల నుంచి 13 డిగ్రీల వరకు నమోదవుతుండడంతో చలి తీవ్రత పెరిగి చేన్లకు ఈ పరిస్థితి ఏర్పడినట్లు వ్యవసాయ శాఖ చెబుతోంది. ధన్వాడ, మక్తల్​, మాగనూరు, కృష్ణ, చిన్నచింతకుంట, మహబూబ్​నగర్​ రూరల్​, దేవరకద్ర, నారాయణపేట, నర్వ, మరికల్, ఊట్కూరు​ తదితర ప్రాంతాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉందని రైతులు చెబుతున్నారు. ఇప్పటికే ఈ ప్రాంతాల్లో దాదాపు 60 శాతం మేర పంటలు దెబ్బతిన్నాయి.

అదనపు పెట్టుబడులు.. 

ఎదుగు, బొదుగు లేని వరి చేన్లను కాపాడుకునేందుకు రైతులు కష్టపడుతున్నారు. వాతావరణంలోని మార్పులతో పాటు జింక్ లోపంతో చేన్లు చనిపోతున్నాయి. మిగతా చోట్ల చేన్లకు కాండం తొలుచు పురుగు, ఆకు ఎండు తెగులు సోకుతున్నాయి. ఆయా రకాల మందులు చల్లుతున్నా, పంటల్లో ఎదుగుదల కనిపిస్తలేదు. కాంఫ్లెక్స్​, యూరియా, పొటాష్​ ఇచ్చినా చేన్లు బతుకుతలేవు. ఇప్పటికే పంటల సాగుకు రైతులు ఎకరాకు రూ.20 వేలకు పైగానే పెట్టుబడులు పెట్టారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో చేన్లకు ఆయా రకాల మందులు కొట్టేందుకు ఎకరాకు అదనంగా మరో రూ.15 వేల వరకు ఖర్చు చేస్తున్నట్లు పలువురు రైతులు చెబుతున్నారు.