పార్లమెంట్‌‌‌‌లో బీసీ బిల్లు పెట్టేలా సహకరించండి : ఆర్‌‌‌‌‌‌‌‌.కృష్ణయ్య

పార్లమెంట్‌‌‌‌లో బీసీ బిల్లు పెట్టేలా సహకరించండి : ఆర్‌‌‌‌‌‌‌‌.కృష్ణయ్య

న్యూఢిల్లీ, వెలుగు: ప్రస్తుత వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లోనే బీసీ బిల్లు ప్రవేశపెట్టేలా సహకరించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య కోరారు. ఈ సందర్భంగా గురువారం ఢిల్లీలో బీసీ సంఘాల నేతలతో కలిసి ఆర్‌‌‌‌‌‌‌‌.కృష్ణయ్య ఖర్గేకు వినతి పత్రం సమర్పించారు. తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. చట్ట సభల్లో బీసీలకు 50 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని ఖర్గేకు విజ్ఞప్తి చేశారు. 

బెంగళూరులో ప్రతిపక్షాలు నిర్వహించిన మీటింగ్‌‌‌‌లో జనాభా లెక్కలు తీయాలనే అంశంపై నిర్ణయం తీసుకోవడంపై ఖర్గేకు కృతజ్ఞతలు తెలిపినట్లు చెప్పారు. తర్వాత జరిగే సమావేశాల్లో బీసీల డిమాండ్లపై చర్చించాలని కోరినట్లు తెలిపారు. అలాగే, బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు, విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లలో క్రీమీలేయర్‌‌‌‌‌‌‌‌ తోలగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కృష్ణయ్య డిమాండ్ చేశారు. 

కేంద్ర విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లను బీసీల జనాభా ప్రకారం 56 శాతానికి పెంచాలని కోరారు. బీసీలు ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి, అభివృద్ధికి ప్రత్యేక స్కీమ్‌‌‌‌లను రూపొందించాలన్నారు. సుప్రీంకోర్టు,- హైకోర్టు జడ్జిల నియామకాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ భేటీలో బీసీ నేతలు గుజ్జ కృష్ణ, కర్రి వేణుమాధవ్ నందగోపాల్, రాజ్ కుమార్, బాషయ్య తదితరులు పాల్గొన్నారు.