
నిర్మల్, వెలుగు: ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను నిర్ణీత గడువులో పరిష్కరించాలని నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. రైతు రుణమాఫీ, వైద్యం, విద్య, వ్యవసాయం, భూ వివాదాలు, డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం, రేషన్ కార్డుల మంజూరు, పింఛన్ తదితర సమస్యల పరిష్కరించాలని దరఖాస్తులు సమర్పించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. శాఖల వారీగా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి వెంటనే పరిష్కరించాలని సూచించారు. ఎండల కారణంగా ప్రారంభించిన టెలిఫోన్ ప్రజావాణికి విశేష స్పందన లభించిందని కలెక్టర్ తెలిపారు. ఫోన్ ద్వారా వచ్చిన అర్జీలను నమోదు చేసి, వాట్సాప్ ద్వారా రసీదు పంపే విధానాన్ని అమలు చేశారు. అడిషనల్ కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిశోర్ కుమార్, ఆర్డీవో రత్నకల్యాణి, పలుశాఖల అధికారులు పాల్గొన్నారు.
అక్రమ పట్టాను రద్దు చేయాలి
నస్పూర్, వెలుగు: ప్రజావాణిలో అందిన దరఖాస్తులను సంబంధిత అధికారుల సమన్వయంతో పరిష్కరించాలని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. కలెక్టరేట్లో అడిషనల్ కలెక్టర్ మోతీలాల్, బెల్లంపల్లి అర్డీవో హరికృష్ణతో కలిసి అర్జీదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని, బెల్లంపల్లి అప్పర్ ప్రైమరీ స్కూల్లో మినీ అంగన్వాడీ కేంద్రం ఏర్పాటు చేయాలని, ప్రభుత్వ ఆస్తులను కాపాడాలని, నస్పూర్ మండలం తాళ్లపల్లి గ్రామానికి చెందిన అక్కపురం రాజయ్య సింగాపూర్ శివారులో తన భూమి సింగరేణి ఓపెన్ కాస్ట్లో పోయిందని నష్టపరిహారం ఇప్పించాలని కోరుతూ దరఖాస్తులు అందాయి.
మందమర్రి మండలం తిమ్మాపూర్ శివారు సర్వే నంబర్ 31/11ను సర్వేనంబర్ 11గా మార్చుకొని 11 ఎకరాల ఫారెస్ట్ ల్యాండ్ ను కొందరు రియల్టర్లు కబ్జా చేసి వెంచర్ చేయడానికి లేఔట్ కోసం అప్లై చేశారని బొక్కలగుట్ట గ్రామానికి చెందిన బల్లికొండ కిషన్ తో పాటు పలువురు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. వారికీ ఫారెస్ట్ ఎన్వోసీ ఇవ్వకుండా ఆదేశాలు జారీ చేయాలని, అక్రమ పట్టాను రద్దు చేసేందుకు మందమర్రి తహసీల్దార్‌కు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామన్నారు.
ప్రజావాణి దరఖాస్తులు వెంటనే పరిష్కరించాలి
ఆసిఫాబాద్, వెలుగు: ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే సంబంధిత అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్లో అడిషనల్ కలెక్టర్ డేవిడ్‌తో కలిసి అర్జీదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. దివ్యాంగ పింఛన్, ఇందిరమ్మ ఇల్లు, కొనుగోలు చేసిన భూమికి పట్టా పాసుపుస్తకం మంజూరు చేయాలని, ఉపాధి కల్పించాలని, ఆక్రమణల నుంచి తన భూమిని తనకు ఇప్పించాలని, రెబ్బెన మండలం కొండపల్లి శివారులో గ్రామపంచాయతీ అనుమతులు లేకుండా భూమిని ప్లాట్లుగా మార్చి అమ్ముతున్నారని చర్యలు తీసుకోవాలని కోరుతూ అర్జీలు సమర్పించారు.
104 దరఖాస్తులు
ఆదిలాబాద్‌టౌన్, వెలుగు: ఆదిలాబాద్ కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణికి 104 దరఖాస్తులు వచ్చాయి. కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అడిషనల్కలెక్టర్
శ్యామలాదేవి, ఆర్డీవో వినోద్ కుమార్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.