గిరిజన ఆశ్రమ స్కూళ్లలో చదివే విద్యార్థులకు ఉత్తమ విద్య అందించాలి : కలెక్టర్ అభిలాష అభినవ్

గిరిజన ఆశ్రమ స్కూళ్లలో చదివే విద్యార్థులకు ఉత్తమ విద్య అందించాలి :  కలెక్టర్ అభిలాష అభినవ్

ఖానాపూర్, వెలుగు: గిరిజన ఆశ్రమ స్కూళ్లలో చదివే విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతోపాటు  సరైన వసతులు కల్పించాలని నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. ఖానాపూర్‌ పట్టణంలోని ప్రభుత్వ గిరిజన బాలబాలికల వసతి గృహాలను ఎమ్మెల్యే బొజ్జు పటేల్‌తో కలిసి బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులకు కార్పొరేట్​స్థాయి విద్యనందించాలన్నారు. 

కిచెన్​ను పరిశీలించిన కలెక్టర్ స్టూడెంట్లకు మెనూ ప్రకారం రుచికరమైన, నాణ్యమైన భోజనం అందించాలన్నారు. కూరగాయలు, వంట సామగ్రిని శుభ్రంగా ఉంచాలన్నారు. స్టూడెంట్లకు ఆరోగ్య సమస్యలు తలెత్తితే మెరుగైన వైద్యం అందించాలన్నారు. రాత్రి వేళల్లో టీచర్లు, సిబ్బంది విద్యార్థులకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ వసతి గృహాల్లోని విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రభుత్వం అన్ని వసతులు కల్పిస్తోందన్నారు. అనంతరం కలెక్టర్ భవిత కేంద్రాన్ని సందర్శించి అధికారులకు పలు సూచనలు చేశారు.

ప్రజా ప్రభుత్వంలో కొత్త రేషన్ కార్డులు

కడెం, వెలుగు: ప్రభుత్వం అందజేస్తున్న కొత్త రేషన్ కార్డులు పేదలు ఆర్థికంగా ఎదగడానికి సహకరిస్తాయని నిర్మల్​కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. బుధవారం దస్తురాబాద్ మండల కేంద్రంలోని రైతు వేదికలో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ తో కలిసి లబ్ధిదారులకు కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కొత్త రేషన్​కార్డుల ద్వారా ఇందిరమ్మ ఇండ్లు, రైతు రుణ మాఫీ, ఫించన్లు, ఉచిత విద్యుత్, గ్యాస్ సబ్సిడీ వంటి పథకాలు పొందవచ్చన్నారు. మండలానికి 1352 కొత్త రేషన్ కార్డులు మంజూరయ్యాయని, మరికొన్ని కార్డుల్లో కుటుంబసభ్యుల పేర్లు చేర్చినట్లు పేర్కొన్నారు. 

ఎమ్మెల్యే మాట్లాడుతూ, పేదల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఆయా కార్యక్రమాల్లో అడిషనల్ కలెక్టర్ కిశోర్ కుమార్, ఖానాపూర్​మండల ప్రత్యేక అధికారి జీవరత్నం, మున్సిపల్ కమిషనర్ సుందర్ సింగ్, తహసీల్దార్ సుజాతారెడ్డి, ఎంపీడీవో సునీత, మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ లు భూషణ్, అబ్దుల్ మాజిద్, మున్సిపల్ మాజీ చైర్మన్ చిన్నం సత్యం, సీపీవో జీవరత్నం, దస్తూరాబాద్​మండల ప్రత్యేక అధికారి నాగవర్ధన్, పౌర సరఫరాల అధికారి రాజేందర్, తహసీల్దార్ విశ్వంబర్ పాల్గొన్నారు.