
- పీస్ కమిటీ మీటింగ్ లో కలెక్టర్
నిర్మల్, వెలుగు: జిల్లాలో గణేశ్ ఉత్సవాలను శాంతియుతంగా నిర్వహించుకోవాలని నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ సూచించారు. బుధవారం కలెక్టరేట్లో గణేశ్ ఉత్సవాలపై పీస్ కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. ఎస్పీ జానకీ షర్మిలతో కలిసి పాల్గొన్నారు. గణేశ్ ఉత్సవాల నిర్వహణపై హిందూ, ముస్లిం ప్రతినిధుల అభిప్రాయాలు, సూచనలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గణేశ్ ఉత్సవాలు సామాజిక సమైక్యతకు ప్రతీకగా నిలవాలని, ప్రతి ఒక్కరూ స్నేహపూర్వకంగా జరుపుకోవాలని కోరారు.
ప్రజల సంప్రదాయాలకు భంగం కలగకుండా జరుపుకోవాలన్నారు. నిర్మల్, భైంసా, ఖానాపూర్ పట్టణాల్లో రూట్‌ల వారీగా బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. ప్రతీ మండపం వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, శానిటేషన్ పనులు నిరంతరం కొనసాగాలని సూచించారు. కేబుల్ వైర్లు, విద్యుత్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని చెప్పారు. ఎస్పీ మాట్లాడుతూ.. ఉత్సవాల సందర్భంగా శాంతిభద్రతల విషయంలో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు.
ఉత్సవాలు సాఫీగా జరిగేలా ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిశోర్ కుమార్, ఏఎస్పీ అవినాశ్ కుమార్, రాజేశ్ మీనా, భైంసా సబ్ కలెక్టర్ సంకేత్ కుమార్, ఆర్డీవో రత్న కల్యాణి, భైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ అనంతరావు పటేల్, వివిధ శాఖల అధికారులు, ఉత్సవ కమిటీ సభ్యులు, ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు.
డీజేలకు అనమతిలేదు
కోటపల్లి, వెలుగు: గణేశ్ నవరాత్రి ఉత్సవాలు శాంతియుతంగా జరుపుకోవాలని చెన్నూరు రూరల్ సీఐ బన్సీలాల్ సూచించారు. కోటపల్లి మండలంలోని గణేశ్ మండలి నిర్వాహకులతో బుధవారం శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఎస్సై రాజేందర్ తో కలిసి మాట్లాడుతూ.. నవరాత్రి ఉత్సవాలను సామరస్యంగా జరుపుకోవాలన్నారు. విద్యుత్ తీగలతో అప్రమత్తంగా ఉండాలన్నాన్నారు. డీజే సౌండ్ బాక్సులకు అనుమతి లేదని తెలిపారు.