ప్రజావాణిలో అందిన దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలి : కలెక్టర్ అభిలాష అభినవ్

ప్రజావాణిలో అందిన దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలి : కలెక్టర్ అభిలాష అభినవ్
  • ప్రజావాణిలో కలెక్టర్లు

నిర్మల్/ఆసిఫాబాద్/నస్పూర్, వెలుగు: ప్రజావాణిలో అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. సోమవారం కలెక్టరేట్​లో మంచిర్యాల ఆర్డీవో శ్రీనివాస్ రావుతో కలిసి అర్జీదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. కాసిపేట మండలం దుబ్బగూడెం ప్రజలు తమ భూములు కేకే ఓపెన్ కాస్ట్​లో పోయాయని, నష్టపరిహారం ఇప్పించాలని కోరుతూ వినతిపత్రం ఇచ్చారు. ఇందిరమ్మ ఇండ్లు, ఆక్రమణల నుంచి భూమిని కాపాడాలని, దివ్యాంగ పింఛన్ ఇప్పించాలని, పట్టా మార్పిడి చేయాలని కోరుతూ దరఖాస్తులు అందించారు.  

సమగ్రంగా పరిశీలించి చర్యలు తీసుకోవాలి

ప్రజావాణిలో వచ్చిన ప్రతి దరఖాస్తును పరిశీలించి, త్వరగా పరిష్కరించాలని నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్​లో ప్రజావాణి ఫిర్యాదులు స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రతి దరఖాస్తులో పేర్కొన్న అంశాన్ని సమగ్రంగా పరిశీలించి, వాస్తవ స్థితిగతులను పరిగణనలోకి తీసుకొని వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

వర్షాకాలం నేపథ్యంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో శానిటేషన్ చర్యలు చేపట్టాలని అన్నారు. స్కూళ్లు, హాస్టళ్లు ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పురోగతిపై సమీక్షించాలన్నారు. ప్రజావాణిలో అడిషనల్ కలెక్టర్ కిశోర్ కుమార్, ఆర్డీవో రత్నకల్యాణి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. 

ప్రజావాణి దరఖాస్తులను పరిష్కరించాలి

ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను సంబంధిత శాఖల సమన్వయంతో త్వరగా పరిష్కరిస్తామని ఆసిఫాబాద్​ అడిషనల్ కలెక్టర్ ఎం.డేవిడ్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ లో ఆర్డీవో లోకేశ్వర్ రావుతో కలిసి అర్జీదారుల నుంచి దరఖాస్తులు స్వీకరిం చారు. ఆసిఫాబాద్ పట్టణం బజారు వాడికి చెందిన సంగీత తనకు ఆవా కార్యకర్తగా ఉపాధి కల్పించాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. ఇందిరమ్మ ఇల్లు, పట్టా పాస్ పుస్తకం మంజూరు చేయాలని, తన భూమిని అక్రమంగా పట్టా చేసుకున్నారని న్యాయం చేయాలని దరఖాస్తులు అందజేశారు.