వనపర్తి జిల్లాలో ఎరువుల కొరత రాకుండా చూడాలి : కలెక్టర్ ఆదర్శ్ సురభి

వనపర్తి జిల్లాలో ఎరువుల కొరత రాకుండా చూడాలి : కలెక్టర్  ఆదర్శ్ సురభి

వనపర్తి, వెలుగు: జిల్లాలో ఎరువుల కొరత రాకుండా చర్యలు తీసుకోవాలని వనపర్తి కలెక్టర్  ఆదర్శ్​ సురభి ఆదేశించారు. సోమవారం వనపర్తి మండలం పెద్దగూడెం గ్రామంలోని ఫర్టిలైజర్  షాప్, పీఏసీఎస్​లో ఏర్పాటు చేసిన ఎరువుల నిల్వలను పరిశీలించారు. షాప్​ ముందు యూరియా, ఇతర ఎరువుల నిల్వలకు సంబంధించిన బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పారు. స్టాక్  రిజిస్టర్  చెక్  చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. 

కడుకుంట్ల గ్రామంలోని పీహెచ్​సీని సందర్శించి ప్రసవాల సంఖ్యను పెంచాలని డాక్టర్లకు సూచించారు. అనంతరం జడ్పీ హైస్కూల్​ను తనిఖీ చేసి పదో తరగతి విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థులకు మేథమేటిక్స్​ పాఠం బోధించి, వాటిపై ప్రశ్నలు అడిగారు. వెనకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని టీచర్లకు సూచించారు. డీఎంహెచ్​వో  శ్రీనివాసులు, డీఏవో ఆంజనేయులు గౌడ్, తహసీల్దార్  రమేశ్ రెడ్డి ఉన్నారు.

గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి..

జిల్లాలో యువత మాదకద్రవ్యాల బారిన పడకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్​ ఆదర్శ్​ సురభి ఆదేశించారు. కలెక్టరేట్​లో గంజాయి, డ్రగ్స్‌‌‌‌‌‌‌‌ నిర్మూలన కోసం తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా స్థాయి సమన్వయ సమావేశం  నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీస్, ఎక్సైజ్‌‌‌‌‌‌‌‌, ఔషధ తనిఖీ, విద్య, వైద్య, అటవీ, వ్యవసాయ, రవాణాశాఖ అధికారులు సమన్వయంతో పని చేసి మత్తు పదార్థాల నిర్మూలనకు కృషి చేయాలన్నారు.

 సరిహద్దు చెక్ పోస్టుల వద్ద తనిఖీలు ముమ్మరం చేయాలని సూచించారు. గంజాయి సాగు చేసే రైతులపై కేసులు పెట్టడంతో పాటు ప్రభుత్వం నుంచి  అందే బెనిఫిట్స్  రద్దు చేస్తామని తెలిపారు. డీఎస్పీ ఉమామహేశ్వరరావు, అడిషనల్​ కలెక్టర్లు వెంకటేశ్వర్లు, యాదయ్య, ఇన్​చార్జి డీఎఫ్​వో​అరవింద్ కుమార్, ఆర్డీవో సుబ్రహ్మణ్యం, డ్రగ్  ఇన్స్​పెక్టర్  రష్మి  పాల్గొన్నారు.