ఏజెంట్లు, అధికారులు సమన్వయంతో ఉండాలి: కలెక్టర్ ఆదర్శ్ సురభి

 ఏజెంట్లు, అధికారులు సమన్వయంతో ఉండాలి: కలెక్టర్  ఆదర్శ్ సురభి

 

వనపర్తి/పెబ్బేరు, వెలుగు :  వనపర్తి జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంలో భాగంగా రాజకీయ పార్టీల బూత్ లెవల్ ఏజెంట్లు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. బుధవారం కలెక్టరేట్‌‌‌‌లో నిర్వహించిన పార్టీ ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జూన్ 25 నుంచి జూలై 24 వరకు ఇంటింటి సర్వే నిర్వహించి, అక్టోబర్ 1న తుది ఓటరు జాబితాను విడుదల చేస్తామని, ఈ ప్రక్రియలో కొత్త ఓటర్ల నమోదు, మరణించిన వారి తొలగింపు వంటి అంశాల్లో పార్టీలు సహకరించాలని కోరారు. 

అనంతరం పెబ్బేరు మండలంలోని రైస్ మిల్లులు, ఐకేపీ కొనుగోలు కేంద్రాలను సందర్శించిన కలెక్టర్, రైతుల నుంచి సేకరించిన ధాన్యంలో మిల్లర్లు ఎలాంటి కోతలు విధించకూడదని హెచ్చరించారు. లారీలను వేగంగా అన్‌‌‌‌లోడ్ చేసి, ట్రక్ షీట్లను వెంటనే పంపడం ద్వారా రైతులకు సకాలంలో నగదు జమ అయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ధాన్యం రవాణాకు ఇబ్బంది లేకుండా అదనపు లారీలను ఏర్పాటు చేస్తామని, వర్షాల దృష్ట్యా కొనుగోలు కేంద్రాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. కార్యక్రమాల్లో అడిషనల్​ కలెక్టర్ వినోద్ కుమార్, డీఎస్వో కాశీ విశ్వనాథ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.