భద్రాద్రికొత్తగూడెం/ ఆళ్లపల్లి, వెలుగు : జిల్లాలోని 379 రెవెన్యూ గ్రామాల్లో మార్కెట్ వాల్యూ అప్డేషన్ ప్రక్రియను గడువులోగా పూర్తి చేయాలని భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ అంకిత్ ఆఫీసర్లను ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి పలు శాఖల ఆఫీసర్లతో శనివారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. భూ భారతి ఐజీఆర్ఎస్ పోర్టల్లో ఫారం 1, 2, 3, 4 కు సంబంధించిన అప్డేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు.
జీవో నెంబర్ 44 ప్రకారం జిల్లాస్థాయి నుంచి మండల స్థాయి వరకు కమిటీలను ఏర్పాటు చేసి మార్కెట్వాల్యూ సవరణ ప్రక్రియను నిర్వహించాలన్నారు. అనంతరం ఆళ్లపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, మక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. మక్కల కొనుగోళ్లు, నిల్వలపై ఆరా తీశారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసి, సిబ్బంది హాజరు, వైద్య సేవలపై అడిగి తెలుసుకున్నారు. మెడికల్ ఆఫీసర్ తరుణ్ అందుబాటులో లేకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. వడదెబ్బతో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించారు.
