- కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
మధిర, వెలుగు: విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే సిబ్బందిపై కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. ఆదివారం మధిర ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని క్యాజువాలిటీ, ఎల్డీఆర్ఎం రూమ్, డయాలసిస్ సెంటర్, లేబర్ రూమ్, ఎమర్జెన్సీ వార్డ్, రేడియాలజీ బ్లాక్, ఓపీ రూమ్ లను పరిశీలిస్తూ రోగులతో మాట్లాడి ఆసుపత్రిలో అందుతున్న సేవల వివరాలను ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్యూటీలో లేని వైద్యులు, ఇతర సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు.
ఆసుపత్రి వైద్యులు హాజరు సంబంధించి రెగ్యులర్ గా రిపోర్ట్ తనకు అందించాలని కలెక్టర్ సూచించారు. ఆసుపత్రికి రెగ్యులర్ గా వస్తున్న ఓపీ వివరాలను కలెక్టర్ పరిశీలించారు. వైద్యులు, సిబ్బంది సకాలంలో అందుబాటులో ఉంటూ ప్రజలకు మెరుగైన వైద్య చికిత్స అందిస్తే ఎక్కువ మంది రోగులు ప్రభుత్వ ఆసుపత్రికి వస్తారని కలెక్టర్ తెలిపారు. ఆసుపత్రిలో రోగులకు రెగ్యులర్ గా అందుతున్న భోజనం నాణ్యత అంశాలను రోగులతో మాట్లాడి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట మధిర తహసీల్దారు రాంబాబు, సంబంధిత అధికారులు, వైద్య సిబ్బంది, తదితరులు ఉన్నారు.
