నీటమునిగిన సిరిసిల్ల కలెక్టరేట్.. రాత్రంతా లోపలే ఉన్న కలెక్టర్

నీటమునిగిన సిరిసిల్ల కలెక్టరేట్.. రాత్రంతా లోపలే ఉన్న కలెక్టర్

రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ మరోసారి నీట మునిగింది. ఈ సారి కలెక్టర్ అనురాగ్ జయంత్ కూడా కలెక్టరేట్ లో చిక్కుకున్నారు. కలెక్టరేట్ ప్రాంగణంలోని క్యాంప్ ఆఫీసులో ఉన్న ఆయన.. బయటకు  రాలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో రాత్రి నుంచి అక్కడే ఉండిపోయారు. ఇవాళ వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించేందుకు కలెక్టర్ వెళ్లాల్సి ఉంది. వరద తీవ్రంగా ఉండటంతో బయటకు రాలేకపోయారు. దీంతో ట్రాక్టర్, జేసీబీ తీసుకొచ్చి.. ట్రాక్టర్ లో కలెక్టర్ అనురాగ్ జయంత్ ను బయటకు తీసుకొచ్చారు. ట్రాక్టర్ ఆగిపోతే నెట్టేందుకు వెనకాలే జేసీబీ కూడా వెళ్లింది.

వర్షం పడిన ప్రతీసారి కలెక్టరేట్ చుట్టూ వరదనీరు చేరుతోంది. గతంలోనూ రెండు మూడు సార్లు కలెక్టరేట్ నీట మునిగింది. ఇప్పుడు సిరిసిల్ల కలెక్టరేట్ చుట్టూ దాదాపు అరకిలోమీటరు మేర భారీగా వరద నీరు చేరింది. నీరు భారీగా ప్రవహిస్తుండటంతో.. కలెక్టరేట్ కు వెళ్లే మార్గం చిన్నపాటి నదీ ప్రవాహంలా కనిపిస్తోంది. కలెక్టరేట్ చుట్టూ చేరిన నీటిని బయటకు పంపిచేందుకు సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.