దరఖాస్తుల పరిశీలనకు తొమ్మిది టీంలు ఏర్పాటు

దరఖాస్తుల పరిశీలనకు తొమ్మిది టీంలు ఏర్పాటు
  • భూభారతిలో భూసమస్యలపై క్షేత్రస్థాయిలో పరిశీలన 
  • కామారెడ్డి జిల్లా కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్​

 లింగంపేట,వెలుగు:  భూభారతిలో వచ్చిన అప్లికేషన్లను చట్ట ప్రకారం పరిష్కరించాలని  జిల్లా కలెక్టర్​ ఆశిష్​సంగ్వాన్​ రెవెన్యూ సిబ్బందికి  సూచించారు.  శుక్రవారం లింగంపేట ఎంపీడీఓ ఆఫీస్​లో కలెక్టర్  రెవెన్యూ టీం సభ్యులతో  సమావేశమై పలు సూచనలు చేశారు.  గత నెల 17 నుంచి 30 వరకు భూభారతి చట్టం ప్రకారం పైలట్​ ప్రాజెక్టు లింగంపేట మండలంలోని 23  రెవెన్యూ గ్రామాల్లో  కింద రెవెన్యూ సదస్సులు నిర్వహించి రైతుల నుంచి దరఖాస్తులను స్వీకరించినట్లు చెప్పారు.  మండలంలో భూసమస్యలకు సంబంధించి 4, 225  దరఖాస్తులు వచ్చినట్లు కలెక్టర్ తెలిపారు.  రైతుల నుంచి వచ్చిన దరఖాస్తులను  పరిశీలించడానికి తొమ్మిది టీంలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.  

ఇప్పటి వరకు1,443 దరఖాస్తులకు సంబంధించిన భూసమస్యలపై క్షేత్ర పర్యటన చేసి భూములను పరిశీలించారన్నారు.  మిగతా దరఖాస్తులను త్వరగా పరిశీలించాలని ఆయన ఆదేశించారు. అటవీ భూములను పక్కాగా జాయింట్​సర్వే చేయాలని దీర్ఘకాలిక పెండింగ్ దరఖాస్తులను పరిశీలించాలని సూచించారు. సమావేశంలో  కలెక్టర్ (రెవెన్యూ) విక్టర్, సబ్​కలెక్టర్​ కిరణ్మయి, ఆర్డీఓ మన్నె ప్రభాకర్, భూభారతి  మండల ప్రత్యేకాధికారి రాజేందర్​, ల్యాండ్​ సర్వే సహాయ సంచాలకులు శ్రీనివాస్​, అటవీ అభివృద్ధి అధికారి రామకృష్ణ , తహసీల్దార్లు, రెవెన్యూ,  అటవీ సిబ్బంది పాల్గొన్నారు.