
కామారెడ్డి టౌన్, వెలుగు : భూభారతి పెండింగ్ అప్లికేషన్లను వారం రోజుల్లోగా పరిష్కరించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులకు సూచించారు. మంగళవారం కలెక్టరేట్లో జిల్లా అధికారులు, గాంధారి, బిచ్కుంద, లింగంపేట తహసీల్దార్లతో నిర్వహించిన మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. కొన్ని ఏండ్లుగా పరిష్కారానికి నోచుకోని సమస్యలకు విముక్తి కల్పించేందుకే ప్రభుత్వం భూభారతి పోర్టల్‌ను తీసుకొచ్చిందన్నారు.
రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన అప్లికేషన్లను క్షుణ్ణంగా పరిశీలించాలని, స్పెషల్ డ్రైవ్ నిర్వహించి భూభారతిలో వచ్చిన దరఖాస్తులను పరిష్కరించి రైతుల సమస్యలు తీర్చాలన్నారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ వి.విక్టర్, సబ్ కలెక్టర్ కిరణ్మయి, ఎల్లారెడ్డి ఆర్డీవో పార్థసింహారెడ్డి, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ రవితేజ, అధికారులు పాల్గొన్నారు.