ఓటర్ జాబితాలో అభ్యంతరాలు తెలపాలి : కలెక్టర్ బాదావత్ సంతోష్

ఓటర్ జాబితాలో అభ్యంతరాలు తెలపాలి  : కలెక్టర్ బాదావత్ సంతోష్

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : మున్సిపల్ ఓటర్ జాబితాలో ఏమైనా అభ్యంతరాలుంటే తెలపాలని కలెక్టర్ బాదావత్ సంతోష్  రాజకీయ పార్టీల నాయకులకు సూచించారు. మంగళవారం కలెక్టరేట్ లో ఓటర్ జాబితా సవరణపై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా 3 మున్సిపాలిటీల్లో వార్డులవారీగా ఓటర్ల జాబితా ఇదివరకే విడుదల చేశామన్నారు.

అభ్యంతరాల పరిశీలన అనంతరం తుది ఓటర్ల జాబితాను ఈనెల 10న విడుదల చేస్తామని తెలిపారు. ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీల నాయకులు సహకరించాలని కోరారు. జిల్లాలోని మూడు మున్సిపాలిటీలు నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలో 24 వార్డులగాను 48 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలో 22 వార్డులకుగాను 44 పోలింగ్ కేంద్రాలు, కొల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో 19 వార్డులకుగాను 38 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు.

ఇప్పటివరకు నాగర్ కర్నూల్ మున్సిపాలిటీలో 28 అభ్యంతరాలు, కల్వకుర్తి మున్సిపాలిటీలో 2, కొల్లాపూర్ మున్సిపాలిటీలో 50 అభ్యంతరాలు వచ్చాయని పేర్కొన్నారు. వాటిని వెంటనే పరిష్కరిస్తామని, ఇంకా ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఈనెల 9 వరకు తెలియజేయాలన్నారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ దేవ సహాయం, మున్సిపల్ కమిషనర్లు, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు.