మున్సిపాలిటీ అభివృద్ధికి సమన్వయంతో పనిచేయాలి : కలెక్టర్​ సంతోష్

మున్సిపాలిటీ అభివృద్ధికి సమన్వయంతో పనిచేయాలి :  కలెక్టర్​ సంతోష్

మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల మున్సిపాలిటీ అభివృద్ధికి అధికారులు, పాలకవర్గం సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ బదావత్ సంతోష్ సూచించారు. సోమవారం జరిగిన మున్సిపల్ వార్షిక బడ్జెట్ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. 2024–25 వార్షిక సంవత్సరానికి మున్సిపల్ సొంత వనరుల నుంచి రూ.32 కోట్ల 91లక్షలు కలుపుకొని మొత్తం అంచనా బడ్జెట్ రూ.59 కోట్ల 19 లక్షలు కేటాయించారు. మున్సిపాలిటీ చట్టం 2019 ప్రకారం మొత్తం సాధారణ ఆదాయం నుంచి కార్మికుల వేతనాలు, చార్జ్ వ్యయాలు, గ్రీన్ బడ్జెట్, ఇతర ఖర్చులు మొత్తం రూ.24 కోట్ల 95 లక్షలు పోగా.. మిగులు బడ్జెట్ రూ.2 కోట్ల 65 లక్షలు ఉందని తెలిపారు.

కలెక్టర్ ​మాట్లాడుతూ.. అందరూ కలిసి మున్సిపాలిటీని అభివృద్ధి చేయాలని, మున్సిపాలిటీ పరిధిలో పన్నులను 100 శాతం వసూలు చేయాలన్నారు. అడిషనల్ కలెక్టర్ రాహుల్, మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్, చైర్మన్ రావుల ఉప్పలయ్య, వైస్ చైర్మన్ నల్ల మహేశ్ తదితరులు పాల్గొన్నారు.

మున్సిపల్ ఆఫీసర్లు, టీపీఓలపై చర్యలు తీసుకోవాలి

నస్పూర్ మున్సిపల్ ఆఫీసులో నిర్వహించిన బడ్జెట్ సమావేశంలో గత ఆర్థిక సంవత్సర బడ్జెట్ సవరణ, 2024–25 వార్షిక అంచనా బడ్జెట్​ను ఆమోదించారు. రూ.24 కోట్ల 44 లక్షల బడ్జెట్ ను జేఏఓ అనితాదేవి చదవగా కౌన్సిలర్లు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా 17వార్డు కౌన్సిలర్ మేకల దాసు, 19వ వార్డు కౌన్సిలర్ రేగుంట చంద్రశేఖర్ మాట్లాడుతూ.. మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణలకు అనుమతులిస్తున్న ఆఫీసర్లు, టీపీఓపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ ​చేశారు. సమావేశానికి హాజరైన కలెక్టర్ సంతోష్​కు వినతిపత్రం ఇచ్చి మాట్లాడారు.

నస్పూర్ శివారులోని సర్వే నంబర్ 42, 64, 72, 119లో ఉన్న ప్రభుత్వ భూముల్లో ఇండ్ల నిర్మాణాలను ప్రోత్సహిస్తూ, అనుమతులిస్తున్న మున్సిపల్ ఆఫీసర్లు, టీపీఓపై చర్యలు తీసుకోవాలన్నారు. మున్సిపల్ ఆదాయాన్ని పెంచడం కంటే వ్యక్తిగత ఆదాయానికి ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపించారు. బడ్జెట్​సమావేశంలో అడిషనల్ కలెక్టర్ రాహుల్, మున్సిపల్ చైర్మన్ వేణు, వైస్ చైర్మన్ రజిత, కమిషనర్ సతీశ్ తదితరులు పాల్గొన్నారు.