- కలెక్టర్ బాదావత్ సంతోష్
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : జంతువుల సంరక్షణ అందరి బాధ్యత అని కలెక్టర్ బాదావత్ సంతోష్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జంతువులపై హింస జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
విద్యార్థుల్లో జంతువుల పట్ల దయా, కరుణ కలిగి ఉండేలా పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. జంతువులను వాహనాల్లో రవాణా చేసే సమయంలో గాయాలు కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
పశువుల రవాణాపై పోలీసుల ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. జంతువులు, పక్షులకు ఎవరైనా హాని చేస్తే జంతు హింస నివారణ చట్టం కింద శిక్షలు తప్పవని హెచ్చరించారు. జంతువులకు ఆహారం, తాగునీరు అందించాలని తెలిపారు.
సమావేశంలో మహిళా నైపుణ్య అభివృద్ధి సంస్థ డైరెక్టర్ ఊహ, డిప్యూటీ కలెక్టర్ హర్షవర్ధన్, అశోక్, జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి జ్ఞానశేఖర్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి యశ్వంతరావు, పీపీవో సుజాత, డీఎస్పీ బుర్రి శ్రీనివాసులు పాల్గొన్నారు.
