ఎన్నికల విధుల్లో బాధ్యతగా ఉండాలి : భారతి హోలీకేరీ

ఎన్నికల విధుల్లో బాధ్యతగా ఉండాలి : భారతి హోలీకేరీ
  •     రంగారెడ్డి కలెక్టర్ భారతి హోలీకేరీ

రంగారెడ్డి కలెక్టరేట్, వెలుగు : ఎన్నికల విధులను బాధ్యతాయుతంగా నిర్వహించాలని రంగారెడ్డి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ భారతి హోలీకేరీ సూచించారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో స్టాస్టిక్ సర్వైలెన్స్, ఫ్లయింగ్ స్క్వాడ్ తదితర నిఘా బృందాల అధికారులకు ఆదివారం ఖైరతాబాద్​లోని రంగారెడ్డి జిల్లా జడ్పీ హాల్ లో ట్రైనింగ్ ఇచ్చారు. రాజకీయ పార్టీలు, అభ్యర్థుల ప్రచార సరళి పరిశీలన, ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే చర్యలను నిరోధించడం, ఫిర్యాదులపై తక్షణమే స్పందించడం, నిరంతర తనిఖీల నిర్వహణ తదితర అంశాలపై కలెక్టర్ పలు సూచనలు చేశారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే  నగదు, మద్యం పంపిణీపై ప్రత్యేక దృష్టిని పెట్టాలని, ఎన్నికల వ్యయం, ప్రచార సరళిపై 24 గంటలు నిఘా పెట్టాలని ఆమె ఆదేశించారు.

స్టాస్టిక్ సర్వైలెన్స్, ఫ్లయింగ్ స్క్వాడ్ వాహనాలకు అత్యాధునిక సాంకేతికతతో కూడిన కెమెరాలను ఏర్పాటు చేయిస్తున్నామని, వీటిని కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షిస్తామని పేర్కొన్నారు. సజావుగా ఎన్నికల నిర్వహణకు అంకితభావంతో కృషి చేయాలని, ఎన్నికల నియమావళిని తప్పనిసరిగా పాటించాలని స్పష్టంచేశారు. కార్యక్రమంంలో అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్, జిల్లా గ్రీవెన్స్ కమిటీ  చైర్మన్, జిల్లా పరిషత్ సీఈఓ దిలీప్ కుమార్,  నోడల్ అధికారులు వెంకట్ రెడ్డి, ధాత్రి దేవి, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.