ఈ అధికారి మాకొద్దు .. సివిల్ సప్లయిస్​ డీఎం వద్దంటూ ఆ శాఖ ఎండీకి కలెక్టర్​ లెటర్

ఈ అధికారి మాకొద్దు .. సివిల్ సప్లయిస్​ డీఎం వద్దంటూ ఆ శాఖ ఎండీకి కలెక్టర్​ లెటర్
  • ఆయన పనితీరు, అవినీతి, అక్రమాలపై పలు ఆరోపణలు 
  • ఏడాదిన్నర కిందట సరెండర్​చేసిన అప్పటి కలెక్టర్​ హోళికేరి 
  • కొద్ది నెలల్లోనే మెదక్​ జిల్లాలోనూ సరెండర్​ చేసిన అధికారులు  
  • ఆపై రెండు జిల్లాలు తిరిగి మళ్లీ పైరవీలతో మంచిర్యాలకే.. 

మంచిర్యాల, వెలుగు: సివిల్ సప్లయిస్​ కార్పొరేషన్ ​మంచిర్యాల జిల్లా మేనేజర్(డీఎం) గోపాల్ ​పనితీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన వ్యవహారశైలి కారణంగా ఉన్నతాధికారులకు సైతం ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతున్నాయి. గతంలో ధాన్యం కొనుగోళ్లలో పలు ఆరోపణలపై అప్పటి కలెక్టర్ ​భారతి హోళికేరి సివిల్​సప్లయిస్​ డిపార్ట్​మెంట్​కు సరెండర్​ చేశారు. ఆ తర్వాత మెదక్​ జిల్లాకు వెళ్లిన కొద్ది రోజులకే అక్కడి ఉన్నతాధికారులు ‘ఈయన మాకొద్దు’ అంటూ సరెండర్​ చేశారు. అనంతరం కుమ్రం భీమ్ ​ఆసిఫాబాద్ ​జిల్లాలో పోస్టింగ్​పొందిన ఆయన​ ఏడాది కిందట తిరిగి మంచిర్యాలకే వచ్చారు. ప్రస్తుత కలెక్టర్ సంతోష్​ కూడా గోపాల్​ను ఇక్కడి నుంచి ట్రాన్స్​ఫర్​ చేయాలని ఇటీవల సివిల్​ సప్లయిస్ ​ఎండీకి లెటర్ ​రాసినట్టు తెలిసింది. దీంతో ఆయన​ పనితీరు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. 

అవినీతి ఆరోపణలు, విధుల్లో నిర్లక్ష్యం..

గతంలో ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లా డీఎంగా పనిచేసిన గోపాల్​ మంచిర్యాల జిల్లా ఆవిర్భావంతో 2016 అక్టోబర్​లో ఇక్కడ ఇన్​చార్జి డీఎంగా బాధ్యతలు చేపట్టి 2017 వరకు కొనసాగారు. 2019 జూన్​లో పూర్తిస్థాయి బాధ్యతలు స్వీకరించి 2022 మే వరకు పనిచేశారు. ఈ మధ్యకాలంలో గోపాల్​పై పలు అవినీతి ఆరోపణలతో పాటు విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వచ్చాయి.

ధాన్యం కొనుగోళ్లలో జాప్యం చేయడం, గోనె సంచులు, లారీలు సమకూర్చడంలో, కాంటా వేసిన వడ్లను మిల్లులకు తరలించడంతో నిర్లక్ష్యం, ధాన్యం సేకరణకు సంబంధించి రోజువారీగా రిపోర్టులు ఇవ్వకపోవడం వంటి 9 కారణాలతో అప్పటి కలెక్టర్ ​భారతి హోళికేరి 2022 మే 28న గోపాల్​ను సివిల్​సప్లయిస్ ​డిపార్ట్​మెంట్​కు సరెండర్​ చేశారు. ఆ తర్వాత మెదక్​ జిల్లా డీఎంగా పోస్టింగ్ ​పొందిన ఆయన అక్కడ కూడా సరిగా పనిచేయలేదు.

విధుల్లో నిర్లక్ష్యంతో పాటు పలు ఆరోపణల కారణంగా కొద్ది నెలల్లోనే అక్కడి ఉన్నతాధికారులు గోపాల్​ను సరెండర్ చేశారు. అనంతరం 2023 ఆరంభంలో కుమ్రం భీమ్​ఆసిఫాబాద్ ​జిల్లా డీఎంగా పోస్టింగ్​ ఇచ్చారు. అప్పటివరకు మంచిర్యాల ఇన్​చార్జి డీఎంగా ఉన్న ఆర్డీఓ వేణు ప్రమోషన్​పై వెళ్లగానే ఖాళీ అయిన స్థానంలో గోపాల్​ను నియమించారు. నిరుడు ఆగస్టు 3న ఇక్కడ డీఎంగా పోస్టింగ్​ ఇచ్చారు. ఉన్నతాధికారులు ఆయనపై ఉన్న ఆరోపణలను పట్టించుకోకుండా గతంలో సరెండర్​అయిన జిల్లాకే తిరిగి పోస్టింగ్​ఇవ్వడం అందరినీ ఆశ్చర్యపర్చింది.  

అయినా తీరు మారలే.. 

రెండుసార్లు సరెండర్​ అయి, రెండు జిల్లాలు తిరిగి ఎట్టకేలకు మంచిర్యాల డీఎంగా వచ్చినప్పటికీ గోపాల్​ పనితీరు మారలేదన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. జిల్లాలో మరికొద్ది రోజుల్లో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి. గత అనుభవాల నేపథ్యంలో గోపాల్​ను ఇక్కడి నుంచి ట్రాన్స్​ఫర్​చేయాలని కలెక్టర్​ సంతోష్​ సివిల్​సప్లయిస్ ​డీఎంకు ఇటీవల లెటర్​ రాసినట్టు సమాచారం. ఈ మధ్యకాలంలోనూ గోపాల్​పై అనేక ఆరోపణలు వచ్చాయి. గోనె సంచులకు సంబంధించి గోల్​మాల్ చేసి ​ఆ లెక్కలను ఇప్పుడు సరిచేస్తున్నట్టు తెలిసింది. రైస్​మిల్లర్ల నుంచి అగ్రిమెంట్స్​తీసుకోకుండానే వడ్లు కేటాయించడం, సీఎంఆర్​ సేకరణలో నిర్లక్ష్యం, ఎంఎల్​ఎస్​పాయింట్లు, గోదాముల నుంచి బియ్యం మాయం కావడంతో పాటు పలు అంశాలపై  ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెళ్లినట్టు సమాచారం.

అంతా ఆ ఉద్యోగి మహిమలే..!  

సివిల్​సప్లయిస్ ​డీఎం ఆఫీస్​లో దీర్ఘకాలంగా తిష్టవేసిన ఒక ఉద్యోగి కనుసన్నల్లో డీఎం గోపాల్​ నడచుకుంటున్నాడని ఆరోపణలు వస్తున్నాయి. ఉద్యోగులను, సిబ్బందిని కంట్రోల్​ చేయడం, మిల్లర్లను మేనేజ్​ చేయడం అంతా ఆ ఉద్యోగి ‘మహి’మలేనని తెలుస్తోంది. సరెండర్ అయిన తర్వాత ఇతర జిల్లాలో పనిచేస్తున్న గోపాల్​ను మళ్లీ ఇక్కడికి తీసుకురావడంలోనూ ఆయనదే కీరోల్​అని సమాచారం. సదరు ఉద్యోగి చాలా ఏండ్లుగా డీఎం ఆఫీస్​లో మకాం వేసి మొత్తం సిస్టమ్​నే తన కంట్రోల్​లోకి తెచ్చుకున్నట్లు ఆరోపణలున్నాయి. ఉన్నతాధికారులు ఆయనపై ఎంక్వైరీ చేసి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.