- ఇన్‌చార్జి కలెక్టర్ గరిమా అగ్రవాల్
వేములవాడరూరల్, వెలుగు: పోలింగ్ కేంద్రాల్లో వసతుల కల్పించాలని రాజన్నసిరిసిల్ల జిల్లా ఎన్నికల అధికారి, ఇన్‌చార్జి కలెక్టర్ గరిమా అగ్రవాల్ అధికారులను ఆదేశించారు. సోమవారం వేములవాడ రూరల్ మండలం వట్టెంల గ్రామంలోని హైస్కూల్‌లోని పోలింగ్ కేంద్రాలను ఆమె పరిశీలించారు. కేంద్రాల్లో వసతులపై ఆరా తీసి, అధికారులకు సూచనలు చేశారు. పోలింగ్, కౌంటింగ్‌కు పటిష్ట భద్రత కల్పించాలన్నారు. ఓటర్లకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అనంతరం స్కూల్‌లోని విద్యార్థులతో మాట్లాడి అభ్యసనా సామర్థ్యాలను పరిశీలించారు.
స్కూల్‌లో మధ్యాహ్న భోజనం, వసతుల తీరును అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత వేములవాడ అర్బన్ ఎంపీడీవో ఆఫీసులో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ కేంద్రాన్ని తనిఖీ చేశారు. వట్టెంల గ్రామంలోని ప్యాక్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ధాన్యం నిల్వలను పరిశీలించి, సేకరణ, తరలింపుపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట ఆర్డీవో రాధాబాయి, తహసీల్దార్ విజయప్రకాశ్‌రావు, ఎంపీడీవోలు శ్రీనివాస్, కీర్తన, తదితరులు పాల్గొన్నారు.

