ప్రజావాణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి : కలెక్టర్ హైమావతి

ప్రజావాణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి : కలెక్టర్ హైమావతి

సిద్దిపేట రూరల్, వెలుగు: ప్రజావాణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ హైమావతి  అధికారులను ఆదేశించారు. సోమవారం సిద్దిపేట కలెక్టరేట్ లో ప్రజల నుంచి వివిధ సమస్యలపై 114 అర్జీలను స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల నుంచి వచ్చిన అర్జీలను అధికారులు  తక్షణమే పరిశీలించి, సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. 

ఈ సందర్భంగా కొమురవెల్లికి చెందిన పాశం స్వరూప మాట్లాడుతూ.. తాను గతంలో మావోయిస్టుగా పని చేసి లొంగిపోయానని, ఆ సమయంలో ప్రభుత్వం ఇంటి స్థలంతో పాటు వ్యవసాయ భూమి, ప్రభుత్వ ఉద్యోగం ఇస్తానని హామీ ఇచ్చి ఇంతవరకు నెరవేర్చలేదన్నారు. ఇప్పటికైనా తనకు రావాల్సినవి ఇప్పించాలని కలెక్టర్ హైమావతికి వినతి పత్రం అందజేశారు. గౌరవెల్లి ప్రాజెక్టు లో భూములు కోల్పోయిన గిరిజనులను ప్రభుత్వం ఆదుకోవాలని ముంపు బాధితులు కలెక్టర్ కు అర్జీని అందజేశారు. 

ఇందిరమ్మ ఇల్లు నిర్మాణంలో భాగంగా నాలుగు నెలల కింద బేస్మెంట్ లెవెల్ కంప్లీట్ చేయగా అధికారులు ఫొటో తీసుకొని వెళ్లినప్పటికీ బిల్లు మంజూరు చేయలేదని అడిగితే రిజెక్ట్ అయిందని చెబుతున్నారని వెంకటాపూర్ గ్రామానికి చెందిన నాగవ్వ కలెక్టర్​కు అర్జీని అందజేసి బిల్లు ఇప్పించాలని కోరారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు గరిమ అగర్వాల్​, అబ్దుల్ హమీద్, డీఆర్​వో నాగరాజమ్మ, కలెక్టరేట్ ఏవో అబ్ధుల్ రహమాన్ పాల్గొన్నారు.

ప్రజావాణికి 28 ఫిర్యాదులు

సంగారెడ్డి టౌన్: ప్రజావాణి  ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ ప్రావీణ్య అధికారులకు సూచించారు. సోమవారం సంగారెడ్డి కలెక్టరేట్ లో ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా అడిషనల్​కలెక్టర్ చంద్రశేఖర్, నారాయణ ఖేడ్ సబ్ కలెక్టర్ ఉమాహారతితో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. కలెక్టర్​మాట్లాడుతూ ప్రజావాణికి 28 ఫిర్యాదులు వచ్చినట్లు పేర్కొన్నారు. ఫిర్యాదులను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ పరిష్కరించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.