
సిద్దిపేట రూరల్, వెలుగు: జర్నలిజం వృత్తి కాదు.. సామాజిక బాధ్యత అని కలెక్టర్ హైమావతి అన్నారు. సిద్దిపేట పట్టణంలోని విపంచి కళా వేదికలో శనివారం మీడియా అకాడమీ ఆధ్వర్యంలో జిల్లా జర్నలిస్టులకు రెండు రోజుల శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
మీడియా.. ప్రజలకు, ప్రభుత్వానికి వారధి లాంటిదని తెలిపారు. ప్రభుత్వ లక్ష్యాలు, అభివృద్ధి, సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందేలా కృషి చేస్తానని, మీడియా పక్షాన సహకారం అందించాలని కోరారు. తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. తెలుగు వార్తలను సులువైన భాషలో రాయాలన్నారు. ఎడిటర్కె.శ్రీనివాస్ మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు క్షణాల్లో ప్రజల్లోకి వెళ్తున్నాయని తెలిపారు.
ఫార్మర్ రిజిస్ట్రీ త్వరగా పూర్తవ్వాలి
ఫార్మర్ రిజిస్ట్రీ త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ హైమావతి ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ లో అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్ తో కలిసి జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాకు కేటాయించిన 6,500 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు లక్ష్యాన్ని చేరుకోవాలని సూచించారు.
పెండింగ్ కేసులు పరిష్కరించాలి
పెండింగ్ కేసులను పరిష్కరించాలని జిల్లా జడ్జి సాయి రమాదేవి, కలెక్టర్ హైమావతి ఆదేశించారు. కోర్టు కాంప్లెక్స్ లో డిస్ట్రిక్ట్ కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ నిర్వహించారు. అదనపు న్యాయమూర్తి జయ ప్రసాద్, జూనియర్ సివిల్ జడ్జి రేవతి, సీపీ అనురాధ తదితరులు పాల్గొన్నారు.