
- కలెక్టర్ గురుకుల బాట
- క్షేత్ర స్థాయిలో విస్తృత తనిఖీలు
- పీహెచ్సీల పనితీరు పరిశీలన
సిద్దిపేట, వెలుగు: సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి విద్యా, వైద్యంపై ఫోకస్ పెట్టారు. కలెక్టర్ గా బాధ్యతలను స్వీకరించిన 40 రోజుల వ్యవధిలో జిల్లాలోని 38 గురుకులాలు, ప్రభుత్వ స్కూళ్లతో పాటు 5 పీహెచ్సీలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. సమస్యలను అడిగి తెలుసుకుని వీలైనన్ని అక్కడే పరిష్కరించారు. గత నెల 14న బాధ్యతలను స్వీకరించగానే పక్షం రోజులకోసారి అన్ని శాఖలతో సమావేశాలు నిర్వహిస్తానని సమగ్ర వివరాలతో హాజరు కావాలని ఆదేశించడంతో అధికారులు అప్రమత్తంగా ఉంటున్నారు. ఇటీవల సిద్దిపేట పట్టణంలోని కేసీఆర్ నగర్ లోని బీసీ గురుకుల స్కూల్విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేయగా కలెక్టర్ స్వయంగా ఆస్పత్రికి వెళ్లి బాలుడి వైద్య సేవలపై ఆరా తీశారు.
విద్యార్థులతో ఇంటరాక్ట్
తాను ఒకప్పుడు టీచర్ నేనని సమస్య ఏదైనా తనకు చెబితే పరిష్కరిస్తానని, పట్టుదలతో చదివి ఉన్నత స్థానాలకు ఎదగాలని, తల్లిదండ్రులకు దూరంగా ఉన్నామని బాధపడవద్దని తనిఖీల సందర్భంగా విద్యార్థులతో ఇంటరాక్ట్ అవుతున్నారు. తొగుట బీసీ సాంఘిక సంక్షేమ బాలికల గురుకులంలో తాగునీటి సమస్య ఉందని విద్యార్థులు చెప్పగానే మిషన్ భగీరథ నీళ్లివ్వాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులను సొంత పిల్లలుగా భావించి విద్యాబుద్ధులు నేర్పించాలని, సమయ పాలన పాటించాలని, మెనూ ప్రకారం భోజనం పెట్టాలని, వారు ఆరోగ్యంగా ఎదిగేలా చూడాలని టీచర్లకు సూచిస్తున్నారు.
తనిఖీల సందర్భంగా కూరగాయల నాణ్యత, వంట గదుల శుభ్రత, స్టాక్ రిజిస్టర్, ఉద్యోగుల అటెండెన్స్ ను పరిశీలించడమే కాకుండా మెను ప్రకారం భోజనాలు పెడుతున్నారా లేదా విద్యార్థులను అడిగి తెలుసుకుంటున్నారు. కలెక్టర్ హైమావతి ఈ నెల 5న ఒకే రోజు జిల్లాలోని 18 గురుకులాలను సందర్శించగా అంతకు ముందు రోజు 6 గురుకులాలను సందర్శించారు.
పీహెచ్సీల ఆకస్మిక తనిఖీ
జిల్లా కలెక్టర్ తన పర్యటనల సందర్భంగా ఆయా ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేస్తున్నారు. పీహెచ్సీలో మందుల లభ్యత, రోగులకు వివిధ పరీక్షల నిర్వహణ, వైద్యాధికారులు, సిబ్బంది అటెండెన్స్ ను పరిశీలిస్తున్నారు. ఇటీవల కోహెడ పీహెచ్సీ ని తనిఖీ చేసినప్పుడు అనుమతి లేకుండా లీవులు తీసుకున్న సిబ్బంది, డాక్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.