హుస్నాబాద్ నియోజకవర్గంలో అభివృద్ధి పనుల్లో వేగం పెంచండి : కలెక్టర్ హైమావతి

హుస్నాబాద్ నియోజకవర్గంలో  అభివృద్ధి పనుల్లో వేగం పెంచండి : కలెక్టర్ హైమావతి

హుస్నాబాద్, వెలుగు: అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. శుక్రవారం హుస్నాబాద్ నియోజకవర్గంలో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలపై మున్సిపల్ ఆఫీసులో సమావేశం నిర్వహించారు. ఆర్డీవో రామ్మూర్తితో పాటు హుస్నాబాద్, కోహెడ, అక్కన్నపేట అధికారులతో సమీక్ష జరిపారు. కలెక్టర్ మాట్లాడుతూ.. నేషనల్ హైవే సిద్దిపేట,-ఎల్కతుర్తి రహదారి పనుల్లో వేగం పెంచాలని, బస్వాపూర్, పందిల్ల వద్ద భూసేకరణను పూర్తి చేయాలని సూచించారు. 

హుస్నాబాద్, -కొత్తపల్లి నాలుగు వరుసల రోడ్డులో ఎలక్ట్రికల్ లైన్ షిఫ్టింగ్, చెట్ల కటింగ్ పనులు వేగవంతం చేయాలని సూచించారు. కోహెడ-సముద్రాల రోడ్ నిర్మాణంలో రోడ్డు భద్రతా సూచికలు, సైన్​బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. హుస్నాబాద్-రామవరం రోడ్డులో మిషన్ భగీరథ, ఎలక్ట్రికల్ పోల్స్ షిఫ్టింగ్ పనులు త్వరగా ముగించాలని ఆదేశించారు. అంతక్కపేట, -కొత్తకొండ రోడ్డు పనులు, న్యాక్ బిల్డింగ్ భూసేకరణ త్వరగా పూర్తి చేయాలని రెవెన్యూ అధికారులను సూచించారు. 

గ్రామ పంచాయతీ భవనాలు, అంగన్వాడీ సెంటర్ల భూసేకరణ పనులను తహసీల్దార్, ఎంపీడీవో, ఇంజనీరింగ్ అధికారులు కలిసి పర్యవేక్షించాలని ఆదేశించారు. సబ్ సెంటర్లు, పీహెచ్​సీల రిపేర్లు తక్షణమే పూర్తి చేయాలన్నారు. మున్సిపల్ పరిధిలో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులు నిర్ణీత కాలంలో ముగించాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. జంక్షన్ల అభివృద్ధి, ఎల్లమ్మ చెరువు సుందరీకరణలో వేగం పెంచాలన్నారు.

 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం 100 శాతం గ్రౌండింగ్ కావాలని, లబ్ధిదారులు పనులు పూర్తి చేసే వరకు పర్యవేక్షణ కొనసాగించాలని ఎంపీడీవోలకు సూచించారు. ఆయిల్ పామ్ సాగు లక్ష్యాన్ని సాధించేందుకు రైతులను ప్రోత్సహించాలని సూచించారు. మిషన్ భగీరథ పనులు పూర్తిచేసి ప్రతీ గ్రామానికి తాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్, తహసీల్దార్ లక్ష్మారెడ్డి, మధుసూదన్, చంద్రశేఖర్, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. 

ప్రజా సేవల్లో అలసత్వం వద్దు

ప్రజా సేవల్లో అలసత్వం వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటానని కలెక్టర్​హైమావతి అధికారులను హెచ్చరించారు. శుక్రవారం హుస్నాబాద్ మండల పరిధిలో కలెక్టర్ పలు ప్రభుత్వ సంస్థలను సందర్శించారు. మొదటగా పందిళ్ల ప్రైమరీ స్కూల్​ను తనిఖీ చేసిన కలెక్టర్ మధ్యాహ్న భోజనం అమలుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లలకు పౌష్టికాహారం అందించడమే పథకం లక్ష్యం అని  సాకులు చెప్పి తప్పించుకుంటే సహించమని మండిపడ్డారు. 

అంగన్వాడీ సెంటర్​ను సందర్శించారు. పిల్లలకు అందించే ఆహారం, స్నాక్స్ ను రుచి చూశారు. బాలింతలకు ఇచ్చే బాలమృతాన్ని తనిఖీ చేశారు. హుస్నాబాద్ మున్సిపల్ పరిధిలోని బస్తీ దవాఖానను ఆకస్మికంగా పరిశీలించారు. మెడికల్ ఆఫీసర్ డిప్యూటేషన్ రద్దు కారణంగా లేరని సిబ్బంది వివరించగా రోగులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ లక్ష్మారెడ్డి ఉన్నారు.