- జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు
- వెంకటాపూర్ మండలంలో గ్రామసభల పరిశీలన
ములుగు/వెంకటాపూర్, వెలుగు: గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తామని, రైతులు ఫార్మర్ రిజిస్ట్రీ నమోదును తప్పనిసరిగా పూర్తి చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ హేమంత్ సహదేవరావు సూచించారు. వెంకటాపూర్ మండలం కేశవాపూర్‌లో నిర్వహించిన ప్రత్యేక గ్రామసభను గురువారం పరిశీలించిన ఆయన ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. గ్రామసభల్లో వచ్చిన సమస్యలను సంబంధిత శాఖలతో సమన్వయం చేసి పరిష్కరిస్తామని చెప్పారు.
ఉపాధి హామీ పథకంలో ప్రజల భాగస్వామ్యం పెరిగితే సీసీ రోడ్లు, డ్రైనేజీలు, వీఓ భవనాలు వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి మరిన్ని నిధులు లభిస్తాయని పేర్కొన్నారు. తాగునీటి ట్యాంకు సహా అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం గోవిందరావుపేట మండలంలోని లక్నవరం సరస్సును సందర్శించి పర్యాటక సదుపాయాలు, పరిశుభ్రత, బోటింగ్ భద్రత తదితర అంశాలను పరిశీలించారు. ఈ కార్యక్రమాల్లో డీపీఓ వెంకయ్య, పంచాయతీరాజ్ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
