అచ్చంపేట, వెలుగు : రోగులకు వైద్య సేవలు అందించడంలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా చేస్తే కఠిన చర్యలు తప్పవని నాగర్ కర్నూల్ కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ హెచ్చరించారు. శనివారం అచ్చంపేట ఏరియా ఆస్పత్రిని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలో పాముకాటు, కుక్కకాటు మందులను నిరంతరం అందుబాటులో ఉంచాలని డాక్టర్లకు సూచించారు.
అంతకుముందు పట్టణంలోని ఆయా కాలనీల్లో పర్యటించి శానిటేషన్, చెత్త సేకరణ, డ్రైనేజీ నిర్వహణ పనులను సమీక్షించారు. వర్షాకాలంలో మురుగునీరు నిల్వ ఉండకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. లబ్ధిదారులు త్వరగా ఇండ్లలోకి వెళ్లేలా నాణ్యతతో కూడిన నిర్మాణాలను స్పీడప్ చేయాలని అధికారులను ఆదేశించారు. అచ్చంపేట మార్కెట్ యార్డులోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కూడా సందర్శించారు. రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోళ్లను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట అచ్చంపేట ఆర్డీఓ యాదయ్య ఉన్నారు.
