
సిద్దిపేట రూరల్, వెలుగు: గురుకుల హాస్టల్ లో విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందజేయాలని జిల్లా కలెక్టర్ కె. హైమావతి అన్నారు. బుధవారం రాత్రి సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి గ్రామ శివారులో ఉన్న తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల స్కూల్, జూనియర్ కాలేజ్ ను కలెక్టర్ ఆకస్మికంగా పరిశీలించారు. వంటగదిని పరిశీలిస్తూ డైలీ కామన్ మెనూ తప్పనిసరిగా ఇంప్లిమెంటేషన్ చేయాలని సిబ్బందిని ఆదేశించారు. డైలీ స్టాక్ రిజిస్టర్ ను వెరిఫై చేస్తూ రోజువారీగా తీసుకుంటున్న సామగ్రిని తూకం వేసి పరిశీలించారు.
విద్యార్థులు భోజనం చేస్తున్నప్పుడు వంట సిబ్బంది తప్ప వార్డెన్, ఇతర టీచర్లు ఎవరూ లేరని అసహనం వ్యక్తం చేశారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. టమాటా పప్పు రుచి మెరుగుపరచాలని, గురుకులం ప్రిన్సిపల్ నుంచి సిబ్బంది వరకు ప్రతి ఒక్కరు విద్యార్థులను సొంత పిల్లల్లా చూసుకోవాలన్నారు. వారికి అన్ని సదుపాయాలు కల్పించే బాధ్యత తీసుకోవాలని తెలిపారు.