
సిద్దిపేట రూరల్, వెలుగు: ఆరోగ్యంగా ఉన్న ప్రతీ యువకుడు రక్తదానం చేయాలని సిద్దిపేట కలెక్టర్ కె.హైమావతి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జిల్లా రక్తదాన శిబిరాన్ని కలెక్టర్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రానున్న రోజుల్లో ప్రభుత్వ డిగ్రీ, మెడికల్, ఇతర కాలేజీల్లో నెలకొకసారి బ్లడ్ క్యాంపు నిర్వహిస్తామన్నారు. రక్తదానం చేసిన యువతకు సర్టిఫికెట్ అందజేశారు. అనంతరం కాలేజీ ఆవరణలో మొక్కలు నాటారు. డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ సునీత, వైస్ ప్రిన్సిపాల్ అయోధ్యరెడ్డి, డీఎంహెచ్‌వో ధనరాజ్, బ్లడ్ బ్యాంక్ ఇన్‌చార్జి శ్రావణి పాల్గొన్నారు.