
చెన్నూరు/కోటపల్లి, వెలుగు: ధాన్యం కొనుగోలు ప్రక్రియ స్పీడప్ చేయాలని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ సంబంధిత అధికారులను ఆదేశించారు. చెన్నూర్ మండలం కిష్టంపేటలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని, కోటపల్లితోపాటు మండలంలోని పారుపల్లి, దేవులవాడ, లక్ష్మీపూర్, అన్నారంలోని వరి కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేశారు. వర్షాకాలం సమీపిస్తుండటంతో ధాన్యాన్ని మిల్లులకు త్వరగా పంపించాలని సెంటర్ నిర్వాహకులకు సూచించారు. ప్రభుత్వం జిల్లాలో 345 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి నిబంధనల ప్రకారం రైతుల నుంచి నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. అవసరమైన గోనె సంచులు, టార్పాలిన్లు అందుబాటులో ఉంచామని, అన్ని సౌకర్యాలు కల్పించామని చెప్పారు.
చెన్నూరు మండల కేంద్రంలో 100 పడకల ప్రభుత్వ ఆస్పత్రి నిర్మాణ పనులను తహసీల్దార్ మల్లికార్జున్‌తో కలిసి పరిశీలించారు. అధికారులు కాంట్రాక్టర్మన్వయంతో పనులు పూర్తిచేయాలని సూచించారు. కోటపల్లిలోని ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. అన్ని రకాల మందులను అందుబాటులో ఉంచాలన్నారు. తహసీల్దార్ రాఘవేందర్ రావు, డిప్యూటీ తహసీల్దార్ నవీన్, మండల వ్యవసాయ అధికారి సాయి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
గ్రామ పరిపాలన అధికారుల పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలి
నస్పూర్, వెలుగు: జిల్లాలో ఈనెల 25న జరగనున్న గ్రామ పరిపాలన అధికారుల పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో అడిషనల్ కలెక్టర్ మోతీలాల్, మంచిర్యాల అర్డీవో శ్రీనివాస్ రావుతో కలిసి జిల్లా విద్య, వైద్య ఆరోగ్య, అగ్నిమాపక, విద్యుత్, సమాచార శాఖల అధికారులు, మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ శివాజీ, మండల తహసీల్దార్ రఫతుల్లాతో కలిసి గ్రామ పరిపాలన అధికారుల పరీక్ష నిర్వహణపై రివ్యూ నిర్వహించారు.
జిల్లా కేంద్రంలోని జడ్పీ బాలుర హైస్కూల్లో ఈనెల 25న ఉదయం 10-.30 నుంచి మధ్యాహ్నం 1-.30 గంటల వరకు పరీక్ష జరుగుతుందని, ఉదయం 9.-30 గంటల నుంచి అభ్యర్థులను పరీక్ష కేంద్రంలోనికి అనుమతిస్తారని, 10 గంటలకు గేటు మూసి వేస్తారని తెలిపారు. పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు.