
నస్పూర్, వెలుగు: జిల్లాలో నకిలీ, నిషేధిత విత్తనాల రవాణా, విక్రయం, వినియోగాన్ని అరికట్టేలా పటిష్ఠ చర్యలు చేపట్టాలని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా, డీసీపీ ఎ.భాస్కర్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి కల్పనతో కలిసి మండలాల తహసీల్దార్లు, వ్యవసాయ శాఖ అధికారులు, వ్యవసాయ విస్తరణాధికారులు, పోలీసులతో రివ్యూ నిర్వహించారు.
కలెక్టర్ మాట్లాడుతూ.. వ్యవసాయ రంగంలో బీటీ పత్తి విత్తనాలతో పాటు బోల్ గార్డ్–1, 2 రకాలను చట్టబద్దంగా వినియోగిస్తున్నామని, బోల్గార్డ్- 3 రకాన్ని నిషేధించినట్లు తెలిపారు. ఈ రకాన్ని ఉపయోగించడం చట్ట రీత్యా నేరమన్నారు. రైతులు నకిలీ, పర్యావరణానికి, మానవాళికి హాని కలిగించే విత్తనాలు, ఎరువులను వినియోగించకుండా మండల స్థాయి వ్యవసాయ అధికారులు అవగాహన కల్పించాలని ఆదేశించారు. నకిలీ, నిషేధిత విత్తనాలు, మందులు తరలించే వాహనాలను సీజ్ చేసి వాహన యజమాని, డ్రైవర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు.
వరిధాన్యం కొనుగోలు యజ్ఞంలా సాగుతోంది
జిల్లాలో వరిధాన్యం కొనుగోలు ప్రక్రియ యజ్ఞంలా సాగుతోందని కలెక్టర్ కుమార్ దీపక్ ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 3 లక్షల 30 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి అంచనా వేశామని, ఏర్పాటు చేసిన 345 కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటివరకు లక్షా 30 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం మిల్లులకు చేరిందని పేర్కొన్నారు. 36 కొనుగోలు కేంద్రాల్లో సేకరణ పూర్తి చేసి వాటిని మూసివేశామని తెలిపారు.
జిల్లాలో 7 వేల మంది రైతుల ఖాతాల్లో రూ.108 కోట్లు జమ చేసినట్లు చెప్పారు. జిల్లాలో మొత్తం 7 వేల మందికి పైచిలుకు అధికారులు ధాన్యం కొనుగోలు ప్రక్రియను యజ్ఞం లాగా కొనసాగిస్తున్నారని, త్వరలోనే సేకరణ పూర్తి చేయనున్నట్లు చెప్పారు.