
నస్పూర్, వెలుగు: ప్రింట్, ఎలక్ట్రానిక్ పాత్రికేయులు రాజ్యాంగం కల్పించిన పత్రిక స్వేచ్ఛను సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు ఉపయోగపడే, వాస్తవాలను తెలియజేయాలని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ ఓ ప్రకటనలో కోరారు. ప్రజాస్వామ్యంలో పాత్రికేయ రంగానికి ప్రత్యేక స్థానం ఉందని, అభివృద్ధి, సంక్షేమం దిశగా ప్రభుత్వాలు చేపట్టే పథకాలు, కార్యక్రమాలను విస్తృతం చేయాలని అన్నారు.
కానీ జిల్లాలో కొంతమంది పాత్రికేయులు తప్పుడు కథనాలను ప్రచురిస్తూ వ్యాపార, వాణిజ్య సంస్థల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో, బెదిరింపులకు పాల్పడి డబ్బులు వసూలు చేస్తున్నట్లు తెలిసిందన్నారు. కొంతమంది నకిలీ జర్నలిస్టుల కారణంగా అసలైనవారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. బెదిరింపులకు పాల్పడితే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
మంచిర్యాలలోని జడ్పీ గర్ల్స్ హైస్కూల్లో ఈ నెల 27న జరుగనున్న గ్రామపాలన అధికారి, సర్వేయర్ల పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టరేట్లో అడిషనల్ కలెక్టర్ పి.చంద్రయ్య, మంచిర్యాల, బెల్లంపల్లి ఆర్డీవోలు శ్రీనివాస్ రావు, హరికృష్ణతో కలిసి జిల్లా విద్య, విద్యుత్ తదితర శాఖల అధికారు లతో పరీక్షల నిర్వహణపై రివ్యూ నిర్వహించారు. 27న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు గ్రామపాలన అధికారి, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు లైసెన్స్డ్సర్వేయర్ల పరీక్ష ఉంటుందన్నారు. జవాబు పత్రాల తరలింపు, స్ట్రాంగ్ రూమ్, పరీక్షా కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాట్లను పోలీసులు పకడ్బందీగా పర్యవేక్షించాలన్నారు.
కాసిపేట మండలంలో కలెక్టర్ తనిఖీలు
కాసిపేట, వెలుగు: కలెక్టర్ కుమార్ దీపక్గురువారం కాసిపేట మండలంలో సుడిగాలి పర్యటన చేశారు. మండలంలోని పీహెచ్సీని తనిఖీ చేశారు. సీజనల్ వ్యాధులపై ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. అవసరమైన అన్ని మందులు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ముత్యంపల్లిలో ఉన్న మోడల్స్కూల్ను సందర్శించారు. పాఠశాలకు కిచెన్షెడ్ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. కేజీబీవీని మౌలిక వసతులను అడిగి తెలుసుకున్నారు.
అక్కడ టాయిలెట్స్ మంజూరు చేస్తామన్నారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీ, దేవాపూర్, రేగులగూడలోని బాలికల ఆశ్రమ స్కూళ్లను సందర్శించి సౌకర్యాల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట మండల ప్రత్యేకాధికారి పురుషోత్తం నాయక్, ఆశ్రమ పాఠశాల ప్రత్యేకాధికారి రాజేశ్వరి, ఎంపీడీవో సత్యనారాయణ సింగ్, ఎంపీవో షేక్ సప్దార్ అలీ, పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు.