నస్పూర్, వెలుగు: రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు నాణ్యమైన ధాన్యం కొంటూ మద్దతు ధర చెల్లిస్తోందని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. లక్షెట్టిపేట మండలం మోదెల, ఇటిక్యాల, గంపలపల్లి గ్రామాల్లో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను అడిషన్ కలెక్టర్ పి.చంద్రయ్య, అధికారులతో కలిసి మంగళవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జిల్లాలో వడ్ల కొనుగోళ్లు పకడ్బందీగా చేపట్టాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. జిల్లాలో జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో 150, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఆధ్వర్యంలో 97, డీసీఎంఎస్ ఆధ్వర్యంలో 63, మెప్మా ఆధ్వర్యంలో 7 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. కలెక్టర్ వెంట సంబంధిత అధికారులుపాల్గొన్నారు.
చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి
విద్యార్థులు విద్యతో పాటు క్రీడారంగంలో రాణించాలని కలెక్టర్ సూచించారు. లక్సెట్టిపేటలోని మహాత్మ జ్యోతిబాఫూలే స్కూల్ మైదానంలో నిర్వహించిన
వెనుకబడిన తరగతుల రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ జిల్లాస్థాయి క్రీడా పోటీల ముగింపు కార్యక్రమానికి అధికారులతో కలిసి హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్యార్థులు విద్యతో పాటు క్రీడా రంగంలో రాణిస్తూ సామాజిక దృక్పథం కలిగి ఉండాలన్నారు. క్రీడలు మానసిక ఉల్లాసం, చదువుపై ఏకాగ్రత, నాయకత్వ లక్షణాలు అలవడతాయని తెలిపారు. పోటీల్లో జిల్లాలోని గుడిపేట బాయ్స్ టీమ్ ఫస్ట్ రాగా, నిర్మల్ జిల్లా బాయ్స్ జట్టు సెకండ్ప్లేస్లో నిలిచిందన్నారు.
వయోవృద్ధుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు
వయోవృద్ధుల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని కలెక్టర్ అన్నారు. కలెక్టరేట్ లో మంచిర్యాల ఆర్డీవో శ్రీనివాసరావు, జిల్లా సంక్షేమ శాఖ అధికారి రౌఫ్ ఖాన్, వయోవృద్ధులతో కలిసి అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం- వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు.
‘వయోవృద్ధుల ఆంక్షలు, శ్రేయస్సు, హక్కులు’ నినాదంతో ఆ నెల 12 నుంచి వారోత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఏమైనా సమస్యలుంటే ఫిర్యాదుల కోసం ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ 14567 నంబర్లో సంప్రదించవచ్చని పేర్కొన్నారు.
