సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలి : కలెక్టర్ కుమార్ దీపక్

సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలి : కలెక్టర్ కుమార్ దీపక్

కోటపల్లి, వెలుగు: వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కోటపల్లిలోని పీహెచ్​సీని మండల పరిషత్ అభివృద్ధి అధికారి నాగేశ్వర్ రెడ్డితో కలిసి తనిఖీ చేశారు. మందుల నిల్వలు, వార్డులు, పరిసరాలను పరిశీలించారు. 

కలెక్టర్ మాట్లాడుతూ.. సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా పాటించాల్సిన జాగ్రత్తలను ప్రజలకు వివరించాలన్నారు. అవసరమున్న మందులను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. అనంతరం  బొప్పారంలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. లబ్ధిదారులు ఇండ్ల నిర్మాణాలు త్వరగా చేపట్టాలన్నారు.

గ్రామంలోని ప్రైమరీ స్కూల్​ను సందర్శించి ప్రహరీ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేసి అందించాలని అధికారులకు సూచించారు. గ్రామంలో పర్యటించి పారిశుధ్యం, తాగునీటిని పరిశీలించారు. అంతర్గత రహదారులు, మురుగు కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలన్నారు. మండల కేంద్రంలోని కేజీబీవీని తహసీల్దార్ రాఘవేంద్రరావుతో కలిసి తనిఖీ చేశారు.

 కిచెన్, క్లాస్​రూమ్స్, ఆహారం నాణ్యత, టాయ్​లెట్స్, హాజరు పట్టిక, పరిసరాలను పరిశీలించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం సకాలంలో పౌష్టిక ఆహారం అందించాలన్నారు. తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి రికార్డులు, రిజిస్టర్లును చెక్​ చేశారు. భూభారతి రెవెన్యూ సదస్సులో అందిన దరఖాస్తులను త్వరగా పరిశీలించి పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు. కలెక్టర్​వెంట సంబంధిత అధికారులున్నారు.

అమృత్ 2.0 ద్వారా తాగునీటిని అందించేందుకు చర్యలు తీసుకోవాలి 

.చెన్నూరు, వెలుగు: అమృత్ 2.0 పథకంలో నీటి ట్యాంక్​ల నిర్మాణాలు త్వరగా పూర్తిచేసి తాగునీటిని అందించేలా చర్యలు తీసుకోవా లని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. చెన్నూర్ పట్టణంలో కొనసాగుతున్న అమృత్ 2.0 ట్యాంక్ నిర్మాణ పనులను శుక్రవారం పరిశీలించారు. మిషన్ భగీరథ పథకంలో ప్రతి ఇంటికీ నల్లా కనెక్షన్ ద్వారా తాగునీరు అందిస్తామన్నారు.