బదిలీలు పారదర్శకంగా చేపట్టాలి : కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్

బదిలీలు పారదర్శకంగా చేపట్టాలి : కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్
  • ఆఫీసర్లతో రివ్యూ మీటింగ్​ 

ఖమ్మం టౌన్, వెలుగు : జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగుల బదిలీ ప్రక్రియ జిల్లాలో పారదర్శకంగా చేపట్టాలని  ఖమ్మం కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ అధికారులకు సూచించారు. బుధవారం కలెక్టరేట్ లో ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై అధికారులతో ఆయన సమీక్షించారు. ఉద్యోగ బదిలీలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ బదిలీలకు అవకాశం ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. జిల్లా క్యాడర్ పోస్టుల బదిలీ ప్రక్రియ కలెక్టర్ అధ్యక్షతన ఏర్పాటు చేసే కమిటీ పర్యవేక్షిస్తుందని చెప్పారు.

నిబంధనల ప్రకారం 4 సంవత్సరాలు ఒకే చోట సర్వీసు పూర్తి చేసిన సిబ్బందిని తప్పనిసరిగా బదిలీ చేయాలని సూచించారు. అదే సమయంలో రెండు సంవత్సరాల సర్వీస్​ పూర్తి చేసుకున్న ఉద్యోగులు బదిలీ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. జూలై 9 నుంచి 12 వరకు బదిలీల కోసం దరఖాస్తులు స్వీకరించాలని సూచించారు. జిల్లాలోని ప్రతి ప్రభుత్వ శాఖ తమ పరిధిలో నాలుగేండ్లు సర్వీసు పూర్తి చేసి బదిలీ కావాల్సిన ఉద్యోగులు, శాఖ పరిధిలోని  ఖాళీల తుది జాబితాను రూపొందించి ఉద్యోగస్తులకు అందుబాటులో ఉంచాలని చెప్పారు.

రెండేండ్లు సర్వీస్ పూర్తి చేసుకున్న ఉద్యోగులు కూడా  బదిలీ కోసం దరఖాస్తు ఇవ్వవచ్చన్నారు. ప్రాధాన్యత క్రమం వరుసలో బదిలీలు చేపట్టనున్నట్లు తెలిపారు. జిల్లాస్థాయి క్యాడర్ పోస్టుల బదిలీ దరఖాస్తులను కలెక్టర్ అధ్యక్షతన ఏర్పాటు చేసే కమిటీ పరిశీలిస్తుందని చెప్పారు. కలెక్టరేట్ ఎదుట బస్ షెల్టర్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. తాగునీటికి ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేయాలని చెప్పారు. 

ప్లాస్టిక్ వినియోగం నియంత్రించాలని, స్టీల్ వాటర్ బాటిళ్లు వాడాలని సూచించారు. శానిటేషన్ సిబ్బందికి ప్రతి నెలా వేతనం అందేలా చూడాలన్నారు. అధికారులు, ఉద్యోగుల హెల్త్ ప్రొఫైల్ కోసం చర్యలు చేపట్టాలని సూచించారు. సమీక్షలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం.రాజేశ్వరి, జిల్లా ఉపాధి కల్పన అధికారి కె. శ్రీరామ్, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.