ఓట్ల లెక్కింపులో పొరపాట్లు చేయొద్దు : నారాయణ రెడ్డి

ఓట్ల లెక్కింపులో పొరపాట్లు చేయొద్దు : నారాయణ రెడ్డి
  • అధికారులు అప్రమత్తంగా ఉండాలి
     

వికారాబాద్, వెలుగు : లోక్ సభ ఎన్నికల ఓట్ల కౌంటింగ్ లో పొరపాట్లు తలెత్తకుండా అలర్ట్ గా ఉండాలని వికారాబాద్ ఎన్నికల అధికారి, కలెక్టర్ నారాయణ రెడ్డి స్పష్టంచేశారు. మంగళవారం ఐడీఓసీ సమావేశం హాల్ లో కౌంటింగ్ సూపర్ వైజర్లు, అసిస్టెంట్  సూపర్ వైజర్లకు కౌంటింగ్ విధి విధానాలపై శిక్షణ ట్రైనింగ్ ఇచ్చారు. ఇందు లో అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులతో కలిసి కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. కౌంటింగ్ లో ఎన్నికల రూల్స్ పాటించాలని, ఏ చిన్న పొరపాటు జరగకుండా మైక్రో అబ్జర్వర్లు, కౌంటింగ్ సూపర్ వైజర్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారుల అధ్వర్యంలో కౌంటింగ్ టీమ్ లు ఉంటాయని, ఆర్ఓల వద్ద ఆర్డర్ కాపీ,ఐడీ కార్డు తీసుకోవాలని తెలిపారు.  

కౌంటింగ్ రోజున ఉదయం  8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు స్టార్ట్ చేయాలని, అనంతరం 08:30 గంటలకు ఈవీఎం కౌంటింగ్ ప్రారంభించాలని సూచించారు. కౌంటింగ్ సూపర్ వైజర్లు కంట్రోల్ యూనిట్ పోలింగ్ స్టేషన్లకు సంబంధించినదా కాదా అని చెక్ చేసుకోవాలని చెప్పారు.  ప్రతి టేబుల్ కు  ముగ్గురు సిబ్బంది ఉంటారని, కౌంటింగ్ ఏజెంట్ల సమక్షంలో కంట్రోల్ యూనిట్ స్విచ్ ఆన్ చేసి, కంట్రోల్ యూనిట్ లో నమోదైన మొత్తం ఓట్లు, ఫారం 17సీ  నందు నమోదైన ఓట్లు సరిచూసుకోవాలని తెలిపారు. కౌంటింగ్ విధులను సమన్వయంతో చేయాలని అధికారులకు  ఆదేశించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్ , ఆర్డీవో వాసుచంద్ర, శ్రీనివాస్, మాస్టర్ ట్రైనర్స్ రాంరెడ్డి, వీరకాంతం , ఎన్నికల విభాగ సిబ్బంది పాల్గొన్నారు.