- కలెక్టర్ పమేలా సత్పతి
కరీంనగర్ టౌన్, వెలుగు: విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకుని దాన్ని సాధించేందుకు నిత్యం శ్రమించి లక్ష్యాలను సాధించాలని కలెక్టర్ పమేలా సత్పతి పిలుపునిచ్చారు. బాలబాలికలు నిత్యం చదువుపైనే ధ్యాస పెట్టాలని, అనవసర విషయాలను పట్టించుకోవద్దని సూచించారు.
శుక్రవారం దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ జయంతి సందర్భంగా కలెక్టరేట్‌లో నిర్వహించిన బాలల దినోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు బాధ్యతయుతంగా క్రమశిక్షణతో, ఇష్టంగా చదువుతూ మంచి ఫలితాలు సాధించాలని సూచించారు. ఈ సందర్భంగా బాలభవన్, కేజీబీవీ సంక్షేమ ట్రస్ట్ స్టూడెంట్ల డ్యాన్సులు అలరించాయి.
ఫిల్మ్ భవన్ లో ఫిలిం సొసైటీ ఆధ్వర్యంలో మూడ్రోజులపాటు నిర్వహించనున్న చిల్డ్రన్స్ ఫిలిం ఫెస్టివల్‌ను కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘నీల్ బత్తె సన్నాట’ అనే హిందీ సినిమాను కేజీబీవీతోపాటు ప్రభుత్వ స్కూళ్లల్లో ప్రదర్శిస్తున్నామన్నారు.
ఈ సినిమాలో చదువురాని తల్లి పనిమనిషిగా పనిచేస్తూ, తన కూతురిని చదివించి ఐఏఎస్ గా తీర్చిదిద్దిన విధానంపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. పిల్లలు తల్లిదండ్రుల కష్టం విలువ తెలుసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజి వాకడే, డీడబ్ల్యూవో సరస్వతి,చైర్ పర్సన్ ధనలక్ష్మి, జేసీబీవో కృపారాణి, కరీంనగర్ ఫిలిం సొసైటీ అధ్యక్షుడు పొన్నం రవిచంద్ర, అడ్వైజర్ మహేశ్, తదితరులు పాల్గొన్నారు.
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించండి
చొప్పదండి, వెలుగు: ప్రభుత్వాసుపత్రులకు వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ పమేలా సత్పతి సిబ్బందిని ఆదేశించారు. శుక్రవారం చొప్పదండిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఓపీ రిజిస్టర్ పరిశీలించి రోగుల వివరాలు తెలుసుకున్నారు.
డెలివరీ రూమ్, వార్డులు, మందులు ఇచ్చే గది పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అక్కడున్న పేషంట్లను వైద్య సేవలు ఎలా అందుతున్నాయో ఆరా తీశారు. డీఎంహెచ్ఓ వెంకటరమణ, ప్రోగ్రాం ఆఫీసర్ సనా, మెడికల్ ఆఫీసర్ శ్రీకీర్తన, ఎంపీడీవో వేణుగోపాల్ రావు, తహసీల్దార్ నవీన్, మున్సిపల్ కమిషనర్ నాగరాజు, సిబ్బంది ఉన్నారు.
