
సంగారెడ్డి టౌన్, వెలుగు: భూభారతి రెవెన్యూ సదస్సులకు వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లాలోని ఆర్డీవోలు, తహసీల్దార్లతో సంగారెడ్డి కలెక్టరేట్ లో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. రెవెన్యూ సదస్సులకు వచ్చిన ప్రతీ దరఖాస్తును పరిశీలించి తహసీల్దార్ఆఫీసు నుంచి ఆర్డీవోకు, అక్కడి నుంచి కలెక్టరేట్ కు పంపించాలని సూచించారు. ఇప్పటివరకు ఎన్ని అర్జీలు పరిష్కరించారు, ఎన్ని పెండింగ్ లో ఉన్నాయి, ఎంత మందికి నోటీసులు ఇచ్చారన్న వివరాలను తహసీల్దార్లను అడిగి తెలుసుకున్నారు.
నిర్ణీత గడువు లోపు అన్ని దరఖాస్తులు పరిష్కరించేలా చూడాలన్నారు. దరఖాస్తులు తిరస్కరణకు గురైతే అందుకు గల కారణాలు పేర్కొనాలని సూచించారు. సాదా బైనామ, పీఓటీకి సంబంధించిన అప్లికేషన్ లను క్షుణ్ణంగా పరిశీలన జరపాలని, క్షేత్రస్థాయిలోకి వెళ్లి సంబంధిత స్థలాలను పరిశీలించి విచారణ జరపాలని అధికారులకు సూచించారు. అన్ని వివరాలను డిజిటల్ రూపంలో పొందుపరచాలని ఆదేశించారు. కార్యక్రమంలో అడిషనల్కలెక్టర్మాధురి, సబ్ కలెక్టర్ ఉమా హారతి, ఆర్డీఓలు దేవుజా, పాండు, అధికారులు సంగారెడ్డి, రాజేందర్, తహసీల్దార్లు పాల్గొన్నారు .