ఎన్నికల నిర్వహణపై అవగాహన ఉండాలి : కలెక్టర్ రాహుల్ రాజ్

ఎన్నికల నిర్వహణపై అవగాహన ఉండాలి : కలెక్టర్ రాహుల్ రాజ్
  • కలెక్టర్ రాహుల్ రాజ్ 

మెదక్, వెలుగు: స్థానిక ఎన్నికల ప్రారంభం నుంచి ముగింపు వరకు అన్ని ప్రక్రియలు నిర్వహించడంపై  సిబ్బందికి సమగ్రమైన అవగాహన ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి,  కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు.  సోమవారం మెదక్​కలెక్టరేట్ లో స్థానిక ఎన్నికల నిర్వహణపై ఆర్వోలు, ఏఆర్వోలు,  ఎంపీడీవోలు, నోడల్ అధికారులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ  నామినేషన్ నుంచి  లెక్కింపు వరకు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. 

ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నామినేషన్ల దాఖలు, అర్హతలు, పరిశీలన, గుర్తులు కేటాయింపు, నామినేషన్ల ఉపసంహరణ, పోలింగ్ మెటీరియల్ పంపిణీ,  కేంద్రాలు, స్ట్రాంగ్ రూములు,  పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు తదితర అంశాలపై దిశా నిర్దేశం చేశారు. అనంతరం మాస్టర్ ట్రైనర్లు సిబ్బందికి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా ట్రైనింగ్​ఇచ్చారు. కార్యక్రమంలో అడిషనల్​కలెక్టర్ నగేశ్, డీఆర్​వో భుజంగరావు, జడ్పీ సీఈవో ఎల్లయ్య, డీఆర్డీవో శ్రీనివాస్ రావు, డీపీవో యాదయ్య, డీఈఓ రాధకిషన్, జిల్లా సైన్స్ అధికారి రాజి రెడ్డి పాల్గొన్నారు.

ఎన్నికల నిబంధనలను పాటించాలి

తూప్రాన్: ప్రతి ఒక్కరూ ఎన్నికల నిబంధనలను పాటించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. సోమవారం ఆయన కౌంటింగ్ సెంటర్ ఏర్పాటు చేయనున్న తూప్రాన్ పట్టణంలోని నోబెల్ కాలేజ్ బిల్డింగ్​ను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. ఎన్నికల నిర్వహణ సజావుగా సాగేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయి ఫలితాలు వచ్చే వరకు ఎన్నికల నిబంధనలు అమలులో ఉంటాయన్నారు. ఎవరైనా నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఆయన వెంట తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి, ఆర్ఐ ప్రేమ్ కుమార్,  రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.