- మెదక్ జిల్లాకు 60 మంది రాక
మెదక్, టౌన్, కౌడిపల్లి, నిజాంపేట, వెలుగు: శిక్షణలో ఉన్న గ్రూప్1 ఆఫీసర్లు ఫీల్డ్ విజిట్లో భాగంగా గ్రామాల్లో పర్యటిస్తున్నారు. మెదక్ జిల్లాకు 60 మంది ఆఫీసర్లు రాగా ఒక్కో టీమ్ లో ఆరుగురి చొప్పున 10 మండలాలకు కేటాయించారు. మంగళ, బుధ వారాల్లో వారికి కేటాయించిన గ్రామంలోనే ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాల తీరును పరిశీలించనున్నారు. క్షేత్ర స్థాయి పర్యటనలో భాగంగా గ్రూప్ వన్ ఆఫీసర్లు రాజ్ కుమార్, సత్య ప్రణవ్, లాతీఫా, ఆశా, ఝన్సీ, గాయత్రి, అభిషేక్ నిజాంపేట మండలం చల్మెడలో పంచాయతీ రాజ్, పోలీస్, రెవెన్యూ, అగ్రికల్చర్, విద్య, వైద్యం, అంగన్వాడీ, మహిళా సంఘాల పనితీరును సర్పంచ్ మల్లేశ్, ఉప సర్పంచ్ మహేందర్, ఎంపీడీఓ రాజిరెడ్డి, ఆర్ఐ ప్రీతి, విలేజ్ సెక్రటరీ వెంకట నర్సింహరెడ్డిని అడిగి తెలుసుకున్నారు. స్థానిక జడ్పీ హైస్కూల్ లో స్టూడెంట్స్ ను వివిధ సబ్జెక్టుల పై ఆరా తీశారు.
కౌడిపల్లి మండలం మహ్మద్ నగర్ లో గ్రూప్1 లో సెలెక్ట్ అయిన డిప్యూటీ కలెక్టర్లు కందారి అనుమిత్ర, ఎస్. వీణ, కమర్షియల్ టాక్స్ ఆఫీసర్ కుమ్మరి శ్రావణ్ కుమార్, డీఎస్పీలు మహమ్మద్ తాజుద్దీన్, రోహిత్ గౌడ్, మున్సిపల్ కమిషనర్ సామేల్(గ్రేటు 2) పర్యటించారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు సక్రమంగా అందుతున్నాయా? లేదా? అని అధికారులను, గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్, ఎంపీఓ రామారావు, ఏపీవో పుణ్యాదాస్, సర్పంచ్ రవి యాదవ్, కార్యదర్శి చందు, ఇతర శాఖల అధికారులు ఉన్నారు.
జవాబుదారీగా పనిచేయాలి..
అవినీతికి తావు లేకుండా సుపరిపాలన కోసం పనిచేయాలని కలెక్టర్ రాహుల్ రాజ్ ట్రైనీ గ్రూప్ 1 ఆఫీసర్లకు సూచించారు. శిక్షణలో భాగంగా జిల్లాకు వచ్చిన వారు కలెక్టర్ ను కలిశారు. ఆయన మాట్లాడుతూట్రైనీ అధికారులు శిక్షణ అనంతరం పారదర్శకంగా, జవాబుదారీగా విధులు నిర్వర్తించినపుడే ప్రజల్లో గుర్తింపు వస్తుందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజల అభివృద్ధే దేశ అభివృద్ధి అన్నారు. సేవల్లో తమ చుట్టూ ఉన్న వనరులను ఉపయోగించుకోవాలన్నారు. ఉద్యోగ సేవల్లో టెక్నాలజీని కూడా ఉపయోగించాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ నగేశ్, జడ్పీ సీఈఓ ఎల్లయ్య, డీఆర్డీఓ శ్రీనివాసరావు పాల్గొన్నారు.
గ్రామ పాలనను క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి: కలెక్టర్ హైమావతి
సిద్దిపేట రూరల్: గ్రామ పాలన వ్యవస్థను క్షుణ్ణంగా అధ్యయనం చేయాలని కలెక్టర్ హైమావతి గ్రూప్ వన్ అధికారులకు సూచించారు. మంగళవారం 37 మందితో కూడిన గ్రూప్ వన్ అధికారులకు సిద్దిపేట కలెక్టరేట్ లో ఆయా శాఖల ద్వారా ప్రజలకు అందిస్తున్న సేవల వివరాలను తెలిపారు.
అనంతరం మాట్లాడుతూ..పంచాయతీలకు వచ్చే ఆదాయం, ప్రజల సేవ కోసం చేసే వ్యయం వివరాలను పరిశీలించాలని, అన్ని రకాల రికార్డులను తనిఖీ చేయాలని సూచించారు. మల్లన్న సాగర్ వద్ద దేశంలోనే అతిపెద్ద వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఉందని చెప్పారు. దాని పక్కనే హైదరాబాద్ మహానగరానికి తాగునీటిని అందించేందుకు చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించారు. కార్యక్రమంలో అడిషనల్కలెక్టర్ అబ్దుల్ హమీద్, డీఆర్ఓ నాగరాజమ్మ, డీఆర్డీవో జయదేవ్ ఆర్య, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
సమస్యలను పరిష్కరించిన అధికారులను మరిచిపోలేరు
తొగుట(మిరుదొడ్డి): సమస్యలు సమస్యలు పరిష్కరించిన అధికారులను ప్రజలు ఎప్పటికీ మరచి పోలేరని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. మిరుదొడ్డి మండలం అల్వాల గ్రామాన్ని గ్రూప్-1 అధికారులు సందర్శించారు. గ్రామానికి వచ్చిన అధికారులకు, బక్కి వెంకటయ్యకు సర్పంచ్ ప్రమీల దేవి ఆధ్వర్యంలో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రూప్-1 అధికారులు నిబద్ధతతో విధులు నిర్వర్తించి పేద ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు.
