టేక్మాల్, వెలుగు: టేక్మాల్ మండలం ధనూరా గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పురోగతిని సోమవారం కలెక్టర్ రాహుల్ రాజ్పరిశీలించారు. ఇళ్లను త్వరగా పూర్తి చేసుకోవాలని లబ్దిదారులకు సూచించారు. వెంటనే బిల్లులు మంజూరవుతున్నట్టు తెలిపారు. ఈ వారం జిల్లాలో 378 మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ.3.88 కోట్లు జమైనట్టు వెల్లడించారు. మండలంలో 474 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయగా వివిధ దశలలో పురోగతిలో ఉన్నట్టు తెలిపారు.
ఇంటి నిర్మాణం బేస్మెంట్ లెవెల్ కు వస్తే లక్ష, రూప్ లెవెల్ లో మరొక లక్ష, స్లాబ్ పూర్తి చేసుకుంటే రెండు లక్షలు, ఇల్లు పూర్తయితే లక్ష కలిపి మొత్తం రూ.5 లక్షలు ప్రభుత్వం జమ చేస్తుందన్నారు. అనంతరం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించారు. అనంతరం తరగతి గదిలో విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించి సంతృప్తికరంగా ఉన్నాయని పేర్కొన్నారు. హాజరు శాతం పెరగాలని ప్రతి ఒక్కరూ స్కూల్కు హాజరయ్యే విధంగా చూడాలని టీచర్లకు కలెక్టర్ సూచించారు.
ప్రతి ఓటు అమూల్యమైనదే
మెదక్, వెలుగు: ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు అమూల్యమైనదని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఓటరు జాబితా, పోలింగ్ కేంద్రాల ముసాయిదా విషయాలపై కలెక్టరేట్ లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 21 జడ్పీటీసీ, 190 ఎంపీటీసీ స్థానాలకు1,052 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.
జిల్లాలో ఓటర్లు మొత్తం 5,23,327 మంది ఉన్నారని తెలిపారు. పురుషులు 2,51,532 మంది, మహిళలు 2,71,787 మంది, ఇతరులు 8 మంది ఉన్నారని వివరించారు. తుది ఓటరు, పోలింగ్ కేంద్రాల జాబితాను 10న ప్రకటిస్తామని వెల్లడించారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ నగేశ్, జడ్పీ సీఈఓ ఎల్లయ్య, డీపీవో యాదయ్య, ఆయా రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.
