ధాన్యం సేకరణ పకడ్బందీగా చేపట్టాలి : కలెక్టర్ రాహుల్ రాజ్

ధాన్యం సేకరణ పకడ్బందీగా చేపట్టాలి : కలెక్టర్ రాహుల్ రాజ్
  • కలెక్టర్ రాహుల్ రాజ్

రామాయంపేట, వెలుగు: ధాన్యం సేకరణ పకడ్బందీగా చేపట్టాలని, అక్రమాలకు పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని కలెక్టర్ రాహుల్ రాజ్ హెచ్చరించారు. మంగళవారం రామాయంపేట మండలం కోనాపూర్  గ్రామంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ జిల్లాలో 498 ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేశామని, అందులో 430 కేంద్రాలు ఇప్పటికే  ప్రారంభమయ్యాయన్నారు. 10 కేంద్రాలకు వరి ధాన్యం రావడం మొదలైందని చెప్పారు. దీపావళి తర్వాత ధాన్యం పెద్ద మొత్తంలో కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉందని, పటిష్టంగా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. 

అకాల వర్షాలకు ధాన్యం తడిసిపోకుండా టార్ఫాలిన్లు, గన్నీ బ్యాగులు, తూకం యంత్రాలు, గ్రెయిన్ క్యాలిపర్స్, తేమ కొలిచే యంత్రాలు సరిపడా అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. రైతుల నుంచి త్వరగా ధాన్యాన్ని సేకరించి వెంటనే రైతులు అకౌంట్​లో డబ్బులు పడేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.  అనంతరం గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించారు. ఇండ్ల నిర్మాణం వేగంగా పూర్తి చేయాలన్నారు. 

ధాన్యం సేకరణకు కంట్రోల్​ రూమ్​ ఏర్పాటు

మెదక్​ టౌన్: జిల్లాలో ఖరీఫ్​ సీజన్​లో ధాన్యం సేకరణకు రైతుల సౌకర్యార్థం కంట్రోల్​ రూమ్​ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్​ రాహుల్​ రాజ్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. రైతులు కొనుగోలు  కేంద్రాల్లో ఏవైనా సమస్యలు ఉంటే కంట్రోల్ రూమ్ నంబర్​ 9281103685 కు ఫోన్​ చేసి చెప్పాలని సూచించారు.