
శివ్వంపేట, వెలుగు: భారీ వర్షాలకు మండలంలోని పోతులబొగుడ వద్ద కొట్టుకు పోయిన రోడ్డును మంగళవారం కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించారు. గ్రామాల ప్రజలకు రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా వెంటనే మరమతులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అనంతరం గుండ్లపల్లి గ్రామంలో గండి పడిన పబ్బన్న కుంటను పరిశీలించారు. రైతులు మాట్లాడుతూ.. ప్రతిసారి కుంట నిండినప్పుడు గుర్తు తెలియని వ్యక్తులు గండి కొడుతున్నారని వారి పైన చర్యలు తీసుకోవాలని కోరారు.
స్పందించిన కలెక్టర్ వెంటనే మరమ్మతులు చేపట్టాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. కుంటకు గండి కొట్టిన వారిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆయన వెంట ఆర్డీవో మహిపాల్ రెడ్డి, తహసీల్దార్ కమలాద్రి, ఎంపీడీవో వెంకటలక్ష్మి, అగ్రికల్చర్ ఏవో లావణ్య, ఆర్ఐ కిషన్, రైతులు వినోద్, దత్తు గౌడ్, కిష్టయ్య, నర్సింలు, సదానందం ఉన్నారు.
దూర ప్రయాణాలకు వెళ్లవద్దు
కౌడిపల్లి: భారీ వర్షాలు ఉన్నందున ప్రజలు అత్యవసరమైతేనే తప్ప బయటకు రావద్దని, దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. మండలంలోని తునికి గ్రామంలో వర్షానికి కూలిన ఇండ్లను పరిశీలించి ఊర చెరువు అలుగును ఆర్డీవో మహిపాల్ రెడ్డి, తహసీల్దార్ తో కలిసి పరిశీలించారు. అనతరం మాట్లాడుతూ సింగూరు నీటిమట్టం పెరుగుతుందని 43 వేల క్యూసెక్కుల నీటి విడుదల చేశారని చెప్పారు.