
టేక్మాల్, వెలుగు: జిల్లాలో వరద ఉధృతికి దెబ్బతిన్న రోడ్లు, పంట పొలాలకు సంబంధించిన నష్టం అంచనా రూపొందించే పనులు వేగంగా జరగాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. సోమవారం పంచాయతీరాజ్ ఈఈ నరసింహులు, రెవెన్యూ అధికారులతో కలిసి మండలంలో క్షేత్రస్టాయిలో పరిశించారు.
కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో భారీ వర్షాలు పడడం వల్ల రోడ్లు, కల్వర్తులు, కాజ్వేలు కోతకు గురై రవాణా స్తంభించిందన్నారు. యుద్ధ ప్రాతిపదిక మరమ్మతులు చేపట్టి రవాణాను పునరుద్ధరించే పనిలో ఉన్నామన్నారు. శాశ్వత మరమ్మతులు, పంట నష్టాన్ని అంచనా వేస్తున్నామని, సమగ్ర నివేదికలు ప్రభుత్వానికి సమర్పిస్తామని చెప్పారు.
ఎఫ్ఎల్ఎన్ అమలులో ఎంఈఓలు, హెచ్ఎంలదే కీలక పాత్ర
మెదక్: ప్రభుత్వ స్కూళ్లలో ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమర్సీ (ఎఫ్ఎల్ఎన్) అమలులో ఎంఈఓలు, స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎంలదే కీలక పాత్ర అని కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. సోమవారం మెదక్ డైట్ కాలేజీలో జిల్లాలోని అన్ని మండలాల ఎంఈఓలు, విద్యాశాఖ అధికారులతో సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఈ సంవత్సరం 10 వ తరగతిలో వంద శాతం ఉత్తీర్ణత సాధించే విధంగా కృషిచేయాలని చెప్పారు. కార్యక్రమంలో డీఈవో రాధా కిషన్, అకాడమిక్ మానిటరింగ్ అధికారి సుదర్శన్ మూర్తి, సైన్స్ ఆఫీసర్ రాజిరెడ్డి, నవీన్, రాజు పాల్గొన్నారు.