అల్లాదుర్గం, వెలుగు: మహిళలు స్వయం సమృద్ధి సాధించేందుకే ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి పథకానికి శ్రీకారం చుట్టిందని కలెక్టర్ రాహుల్ రాజ్ చెప్పారు. అందోల్ నియోజకవర్గంలోని అల్లాదుర్గం, రేగోడు, టేక్మాల్ మండలాలకు సంబంధించి ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం అల్లాదుర్గంలో ఏర్పాటు చేశారు. జడ్పీ సీఈఓ ఎల్లయ్య, ఆర్డీవో రమాదేవితో కలిసి కలెక్టర్ మహిళలకు చీరలను పంపిణీ చేశారు.
అనంతరం మాట్లాడుతూ..జిల్లాలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ.500 కోట్ల రుణాలు బ్యాంకు లింకేజీ ద్వారా అందించామన్నారు. ప్రస్తుతం గ్రామీణ ప్రాంత మహిళలకు చీరలను పంపిణీ చేస్తున్నామని, పట్టణ ప్రాంతాల్లో మార్చి 1 నుంచి అందజేస్తామని చెప్పారు. అనంతరం ఎంపీడీవో ఆఫీసును సందర్శించారు. జీపీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణకు చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించారు. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఎన్నికలను నిర్వహించాలని అధికారులకు సూచించారు.
బీమాని సద్వినియోగం చేసుకోవాలి
మెదక్‌టౌన్ : ప్రభుత్వం కార్మికులకు అందిస్తున్న బీమాను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రాహుల్రాజ్సూచించారు. మెదక్కలెక్టరేట్లోని కార్మిక శాఖ ఆఫీసులో భవన నిర్మాణరంగ కార్మికులతో కలిసి బీమా పెంపు పోస్టర్‌ను ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. కార్మికుల బీమా పెంపు సదస్సులు ఈ నెల 24 నుంచి డిసెంబరు 8వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్మికులకు సహజ మరణం సంభవిస్తే రూ.2 లక్షలు, ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.10 లక్షలు, శాశ్వత అంగవైకల్యానికి రూ.5 లక్షలు, పాక్షిక అంగవైకల్యానికి రూ. 4 లక్షలు, కార్మికుల మొదటి ఇద్దరి కూతుళ్ల వివాహాలకుకు రూ.30 వేలు, ప్రసూతి కానుకగా రూ. 30 వేలు, రిజిస్ట్రేషన్ కాని కార్మికులు ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.50 వేలు, ఇతర బీమా సదుపాయాలు కల్పించారన్నారు.
మెదక్ జిల్లా ఇన్చార్జి సహాయ కార్మిక అధికారి సత్యేంద్ర ప్రసాద్ ఉన్నారు. అనంతరం జిల్లా కలెక్టరేట్లో రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు ఎన్నికల విధులు, బాధ్యతలు, నియమ నిబంధనలపై శిక్షణా కార్యక్రమాన్ని అడిషనల్ కలెక్టర్ నగేశ్, డీఈవో విజయ, డీఎస్వో రాజిరెడ్డితో కలిసి నిర్వహించారు. ఎన్నికల నిబంధనలపై అధికారులు, సిబ్బంది పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలన్నారు. పారదర్శకంగా విధులు నిర్వహించాలని సూచించారు.
సారూ.. మా బాబుకు పింఛన్ ఇప్పించరూ..
మెదక్: ఈ ఫొటోలోని బాలుడి పేరు అభిరామ్. ఇతడు కూర్చున్న చోటు నుంచి కదలలేడు. జన్యు లోపం కారణంగా నరాల బలహీనతతో కాళ్లు చచ్చుబడిపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. మెదక్ జిల్లా రామాయంపేట మండలం కాట్రియాల గ్రామానికి చెందిన గౌరీ స్వామి, -లావణ్య దంపతులకు ఇద్దరు సంతానం. కూతురు శ్రావ్య, కొడుకు అభిరామ్ ఉన్నాడు. స్వామి కూలీ పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అభిరామ్ మూడో తరగతి వరకు అందరి పిల్లల్లాగే సంతోషంగా స్కూల్ కు వెళ్లేవాడు.
ఓ రోజు అనూహ్యంగా కింద పడిపోయాడు. తల్లిదండ్రులు హైదరాబాద్ లోని ఓ కార్పొరేట్ హాస్పిటల్ కు తరలించారు. ట్రీట్మెంట్ కోసం తమకున్న 15 గుంటల భూమి అమ్మినా ఫలితం లేదు. జన్యులోపం కారణంగా అభిరామ్ శాశ్వతంగా నడవలేడని డాక్టర్లు చెప్పడంతో చేసేది ఏమీలేక ఊరుకున్నారు. సోమవారం ప్రజావాణిలో దరఖాస్తు ఇచ్చేందుకు మెదక్ కలెక్టరేట్‌కు వచ్చారు. స్థానిక ఎన్నికల కారణంగా ప్రజావాణి నిర్వహించకపోవడంతో హెల్ప్ డెస్క్‌లో అర్జీ ఇచ్చారు.
