
మెదక్ టౌన్, వెలుగు: టీచర్లు విద్యార్థులకు అందుబాటులో ఉండి గుణాత్మక విద్యను బోధించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. శుక్రవారం హవేలీ ఘనపూర్ మండలంలోని డైట్ కాలేజీలో ఎంఈవోలు, స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎంలతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్మాట్లాడుతూ.. ఎఫ్ఎల్ఎన్(ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరీ) అమలులో భాగంగా ప్రాథమిక స్థాయి నుంచి విద్యార్థులకు కనీస సామర్థ్యాలు పెంచాలన్నారు.
ఈ విషయంలో ఎంఈవోలు, హెడ్మాస్టర్లు వారికి నిర్దేశించిన లక్ష్యాల మేరకు క్షేత్రస్థాయిలో స్కూళ్లను సందర్శించి టీచర్లు, విద్యార్థుల హాజరుపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఈ విద్యా సంవత్సరం పదో తరగతి ఫలితాల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించే దిశగా కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో డీఈవో రాధాకిషన్, ఏఎంవో సుదర్శనమూర్తి, ఎంఈవోలు, స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎంలు పాల్గొన్నారు.
పిల్లల ఆరోగ్యంపై అవగాహన కల్పించాలి
చిన్నారులు వ్యాధుల బారినపడకుండా ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దే బాధ్యత డీడబ్ల్యూవో సిబ్బందిపై ఉందని కలెక్టర్అన్నారు. మెదక్కలెక్టర్ ఆఫీసులో డీడబ్ల్యూవో అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. పుట్టిన బిడ్డ ఆరోగ్యం పట్ల తల్లులకు అవగాహన కల్పించాలన్నారు. సహజసిద్ధంగా లభించే మునగ, కరివేపాకు వంటి ఆకు కూరలను ఆహారంలో చేర్చుకోవాలని సూచించారు.
గర్భిణీలు ఆరోగ్యవంతంగా ఉండేందుకు పోషకాహారం తీసుకోవాలన్నారు. ఆరోగ్యవంతమైన సమాజం కోసం అందరూ సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డీడబ్ల్యూవో హేమభార్గవి, సీడీపీవోలు, అధికారులు పాల్గొన్నారు.