భూపాలపల్లి రూరల్, వెలుగు: జిల్లాలో పెండింగ్ లోవున్న రోడ్డు పనులను త్వరగా పూర్తి చేయాలని జయశంకర్ భూపాలపల్లి కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. మంగళవారం ఐడీవోసీ ఆఫీస్లో రెవెన్యూ, ఆర్అండ్ బీ ఇంజినీరింగ్, ప్రణాళిక శాఖల ఆఫీసర్లతో రోడ్డు నిర్మాణ పనుల పురోగతిపై ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో జరుగుతున్న ప్రతి గ్రామ, మండలం, ప్రధాన రహదారుల పనులు నిర్దేశిత గడువులో పూర్తి చేయాలని, ఆలస్యం జరిగితే కారణాలు వివరించాలన్నారు. మేడారం జాతర దృష్టిలో ఉంచుకొని జాతరకు అనుసంధానం చేసే రోడ్ల పనులను త్వరగా పూర్తి చేయాలని తెలిపారు. సమావేశంలో కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, ఆర్ అండ్ బీ ఈఈ రమేశ్, సీపీవో బాబూరావు తదితరులు పాల్గొన్నారు.
