అర్హులైన ప్రతి కుటుంబానికీ రేషన్‌‌ కార్డు : కలెక్టర్ రాజర్షి షా, ఎమ్మెల్యే అనిల్ జాదవ్

అర్హులైన ప్రతి కుటుంబానికీ రేషన్‌‌ కార్డు : కలెక్టర్ రాజర్షి షా, ఎమ్మెల్యే అనిల్ జాదవ్

బజార్ హత్నూర్/గుడిహత్నూర్, వెలుగు: అర్హులైన ప్రతి ఒక్క కుటుంబానికి రేషన్ కార్డులు అందిస్తామని, కార్డుల అందజేత నిరంతర ప్రక్రియ అని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా, బోథ్​ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. బజార్ హత్నూర్, గుడి హత్నూర్ మండల కేంద్రాల్లోని రైతు వేదికల్లో లబ్ధిదారులకు రేషన్​ కార్డులు పంపిణీ చేశారు. బజార్​హత్నూర్ ​మండలానికి చెందిన 160 మందికి, గుడి హత్నూర్​మండలంలోని158 మంది లబ్ధిదారులకు రేషన్ కార్డుల ప్రొసీడింగ్స్ అందజేశారు. 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..  ప్రభుత్వం ఇస్తున్న సన్న బియ్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పెండింగ్​లో ఉన్న రేషన్ కార్డులను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ  త్వరితగతిన పూర్తిచేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజలకు సమస్యలు రాకుండా చూడాలన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి మొరం అవసరమని, అటవీశాఖ అధికారుల అనుమతులు ఇప్పించాలని కోలాంగూడ వాసులు విన్నవించగా.. సమస్య పరిష్కారించాలని తహసీల్దార్ శ్యాంసుందర్​ను ఆదేశించారు. 

సహకార సంఘంలో తనిఖీలు

అనంతరం బజార్​హత్నూర్​ మండల కేంద్రంలోని వ్యవసాయ సహకార సంఘాన్ని తనిఖీ చేశారు. ఎరువుల పంపిణీ తీరుపై ఆరా తీశారు. యూరియా, డీఏపీ, ఇతర స్టాక్ రిజిస్టర్, రికార్డులను పరిశీలించారు. గిడ్డంగులను తనిఖీ చేశారు. ఆయా కార్యక్రమాల్లో అడిషనల్ కలెక్టర్ శ్యామలాదేవి, ఆర్డీవో స్రవంతి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ మల్లెపూల నర్సయ్య, తహసీల్దార్లు శ్యాంసుందర్, కవిత, ఎంపీడీవో శ్రీనివాస్,  ఆత్మ చైర్మన్ రాజు, ఫాక్స్ చైర్మన్ వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

అర్హులైన ప్రతి ఒక్కరికీ కార్డులు 

కడెం, వెలుగు: అర్హులైన పేదలందరికీ ప్రభుత్వం రేషన్ కార్డులు మంజూరు చేస్తోందని కాంగ్రెస్ కడెం మండల నాయకులు అన్నారు. గురువారం మండలంలోని ఎల్లాగడపలో లబ్ధిదారులకు రేషన్ కార్డుల ప్రొసీడింగ్స్​ ​అందజేశారు. రాష్ట్రంలో పదేండ్లు పాలించిన బీఆర్​ఎస్ ​ఒక్కరికి కూడా రేషన్ కార్డు మంజూరు చేయలేదన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ భూషణ్, మహమ్మద్ సలీం, రహీం, గంగన్న, కె.శ్రీనివాస్, భూమరాజం తదితరులు పాల్గొన్నారు.