- చెక్కులు అందజేసిన కలెక్టర్
ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్ మున్సిపాలిటీలో పరిధిలోని1049 మహిళా సంఘాలకు సోమవారం మున్సిపల్ కార్యాలయంలో రూ. 4.25 కోట్ల వడ్డీ లేని రుణాలను కలెక్టర్ రాజర్షి షా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళల ఆర్థికాభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని, ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో భాగంగా వడ్డీ లేని రుణాలు, చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టినట్లు పేర్కొన్నారు. మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
రుణాలు డీబీటీ పద్ధతి ద్వారా నేరుగా సంఘాల బ్యాంకు ఖాతాల్లో జమవుతాయని తెలిపారు. ఈ డబ్బును కుటుంబ అవసరాలు, పిల్లల చదువులు, ఆరోగ్యం, వ్యాపార విస్తరణకు వినియోగించుకొని ఆర్థికంగా ఎదగాలని సూచించారు. పట్టణంలో సుమారు 11,000 మంది మహిళలకు (దాదాపు 30 శాతం కుటుంబాలకు) దీని ద్వారా లబ్ధి చేకూరుతోందన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ శ్యామలాదేవి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ నర్సయ్య, మున్సిపల్ కమిషనర్ రాజు, డీఎంసీ మెప్మా శ్రీనివాస్, టీఎంసీ మెప్మా భాగ్యలక్ష్మి పాల్గొన్నారు.
సర్పంచ్ లకు శిక్షణ
గ్రామీణ పరిపాలనలో సర్పంచ్ల పాత్ర కీలకమని కలెక్టర్ అన్నారు. జిల్లాలో కొత్తగా ఎన్నికైన సర్పంచ్లకు పంచాయతీ రాజ్ వనరుల కేంద్రం సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రత్యేక శిక్షణా తరగతుల కార్యక్రమానికి ఆయన హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ ఆదేశాల మేరకు సర్పంచ్లకు ఫిబ్రవరి 27 వరకు విడతల వారీగా ట్రైనింగ్ఇస్తున్నట్లు తెలిపారు. ఈ ట్రైనింగ్లో సర్పంచ్ల అధికారాలు, బాధ్యతలు, విధులపై అవగాహన కల్పించడంతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధుల వినియోగంపై వివరిస్తున్నట్లు పేర్కొన్నారు.
సీఎం కప్ పోటీలు ఘనంగా నిర్వహించాలి
సీఎం కప్ పోటీలను విజయవంతం చేయాలని కలెక్టర్ రాజర్షి షా పిలుపునిచ్చారు. రెండో విడత సీఎం కప్ నిర్వహణపై కలెక్టరేట్ లో జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు క్రీడాకారులను ప్రోత్సహించేందుకు సీఎం కప్ పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సీఎం కప్ పోస్టర్ ను అధికారులతో కలిసి ఆవిష్కరించారు.
