జనగామ అర్బన్, వెలుగు : పరీక్షలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, సమయాన్ని వృథా చేసుకోవద్దని కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ విద్యార్థులకు సూచించారు. శుక్రవారం జనగామ మండలం పెంబర్తి గ్రామం లోని మహాత్మాజ్యోతిరావు ఫూలే బీసీ బాలుర గురుకుల పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా స్టాఫ్ రూంకి వెళ్లి టీచర్ల అటెండెన్స్రిజిస్టర్ ను పరిశీలించారు.
అనంతరం టెన్త్ క్లాస్‌కు వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు. పదో తరగతి పరీక్షలకు ప్రత్యేక కార్యాచరణ పెట్టుకొని ఇప్పటి నుంచే ప్రిపేర్ కావాలని సూచించారు. పదో తరగతి విద్యార్థులపై ఉపాధ్యాయులు ఫోకస్పెట్టాలని చెప్పారు. అవసరం ఉన్న విద్యార్థులకు పలు మార్లు రివిజన్ చేస్తూ వారు ఆయా సబ్జెక్టుల్లో రాణించేలా కృషి చేయాలని తెలిపారు. ఆయన వెంట ప్రిన్సిపాల్ చంద్రమోహన్, టీచర్లు ఉన్నారు.
సీసీఐ కేంద్రాల్లోనే పత్తిని విక్రయించాలి..
సీసీఐ కేంద్రాల్లోనే పత్తిని విక్రయించి మద్దతు ధర పొందాలని కలెక్టర్ రిజ్వాన్‌భాషా షేక్ రైతులకు సూచించారు. జనగామ మండలంలోని ఓబుల్‌కేశవపూర్ గ్రామంలోని వేంకటేశ్వర కాటన్ ఇండస్ట్రీస్‌లో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ 2025-–26 సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం పత్తి పంటకు కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ. 8110 గా నిర్ణయించిందన్నారు. రైతులందరూ ముందుగా కపాస్కిసాన్ యాప్ ద్వారా జిన్నింగ్ మిల్లు ఎంపిక చేసుకొని స్లాట్ బుక్ చేసుకొని పత్తిని అమ్ముకోవాలని సూచించారు.
యూనియన్ బ్యాంకు శాఖ సేవలు ప్రారంభం..
జనగామ ఐడీవోసీ కలెక్టర్భవనం ప్రక్కన యూనియన్‌బ్యాంకు శాఖను జనగామ కలెక్టర్రిజ్వాన్భాషా షేక్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కలెక్టరేట్ దగ్గరగా యూనియన్‌బ్యాంకు శాఖను ప్రారంభించినందున వారిని అభినందించారు. ఈ బ్యాంకు సేవలు ప్రజలకు అందుబాటులో ఉంటాయన్నారు.
యుబీఐ ఆధ్వర్యంలో బిజినెస్ కరస్పాండెంట్ ద్వారా అన్ని గ్రామాల్లో ప్రజలకు బ్యాంకు సేవలను అందించాలన్నారు. అనంతరం యూబీఐ చీఫ్జనరల్ మేనేజర్భాస్కర్రావు మాట్లాడుతూ బ్యాంకు సేవలను జనగామ ప్రజలకు అందిస్తామని తెలిపారు. ఖాతాదారులందరూ బ్యాంకు సేవలను వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఏజీఎం శ్రీరామ్, రిజినల్ మేనేజర్ కమలాకర్, బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.
