జనగామ అర్బన్, వెలుగు : మక్కజొన్న, ధాన్యం కొనుగోళ్లను సజావుగా నిర్వహించాలని జనగామ కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. శనివారం కలెక్టరేట్లో కొనుగోళ్ల ప్రక్రియపై అడిషనల్ కలెక్టర్ బెన్ షాలోమ్తో కలిసి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇప్పటివరకు 1,32,459 టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయగా, 1,23,760 టన్నులను మిల్లులకు తరలించామని, 13,115 మంది రైతుల ఖాతాల్లోకి రూ.233 కోట్లు జమ చేసినట్లు చెప్పారు.
1,05,253 టన్నులు కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను ఓపీఎంఎస్ లో నమోదు చేసిశామని, మొత్తం 572 మంది హమాలీలు ఉన్నారన్నారు. మొక్కజొన్న కొనుగోలుకి సంబంధించి ఆరు కేంద్రాల ద్వారా 3568 మంది రైతుల ద్వారా 17,499 టన్నులు కొనుగోలు చేశామని, 16323 మెట్రిక్ టన్నుల మొక్కజొన్నలను గోదాంలకు తరలించామని పేర్కొన్నారు. కొనుగోళ్ల ప్రక్రియలో మరింత వేగం పెంచాలని ఆదేశించారు.
అనంతరం కలెక్టరేట్లో ప్రేరణ సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో డాక్టర్ అగర్వాల్ వైద్య నిపుణులతో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించగా, కలెక్టర్ పాల్గొన్నారు. కార్యక్రమంలో డీఆర్‌డీవో భాస్కర్, మార్క్ఫెడ్ డీఎం చంద్రశేఖర్, డీసీఓ కోదండరాములు, డీఎంవో రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
