మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు

మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు

జహీరాబాద్, వెలుగు : జహీరాబాద్ నియోజకవర్గంలో  కొనసాగుతున్న అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ డాక్టర్ శరత్, ఎమ్మెల్యే మాణిక్ రావు సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం జహీరాబాద్ మున్సిపల్ మీటింగ్ హాల్ లో అభివృద్ధి,  సంక్షేమ పథకాల అమలు తీరుపై నియోజకవర్గ స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గంలోని ఝరాసంగం, కోహిర్, మొగుడంపల్లి, న్యాల్కల్, జహీరాబాద్, మండలాలతో పాటు జహీరాబాద్ పట్టణంలో మంజూరు చేసిన రోడ్లు, భవనాలు, శ్మశాన వాటికలు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల  నిర్మాణాల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు తొందరగా పూర్తి చేసి లబ్ధిదారులకు పంపిణీ చేసే ఏర్పాట్లు చేయాలని వారు సూచించారు. అనంతరం పట్టణంలోని ప్రధాన రహదారి పక్కన నిర్మిస్తున్న  దుకాణాల సముదాయాన్ని  కలెక్టర్, ఎమ్మెల్యే పరిశీలించారు. షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులను స్పీడప్​ చేయాలని కాంట్రాక్టర్ జావీద్ కు సూచించారు.  సమావేశంలో అడిషనల్​ కలెక్టర్  రాజార్షి షా, డీసీఎంఎస్ చైర్మన్ శివ కుమార్, ఆర్ డీవో రమేశ్​బాబు పాల్గొన్నారు.

23 హాస్టళ్లలో లైబ్రరీల ఏర్పాటు
కంది, వెలుగు : ప్రతి ఒక్కరూ ఇండిపెండెంట్ రీడర్ అవ్వాలని, ప్రతి స్టూడెంట్ నూ  అలా తయారు చేయడమే రూం టు రీడ్ సంస్థ లక్ష్యమని లైబ్రరీ కోచ్ కోట గీత తెలిపారు.  బుధవారం సంగారెడ్డి మండలం హనుమాన్​ నగర్​లోని ప్రైమరీ స్కూల్​లో స్టూడెంట్స్​కు పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ సంస్థ ఆధ్వర్యంలో  ఈ ఏడాది  సంగారెడ్డి, సదాశివపేట మండలాల్లోని 23 ప్రాథమిక పాఠశాలలను దత్తత తీసుకుని స్కూల్​ లైబ్రరీ ప్రోగ్రామ్​ను ప్రారంభించినట్టు చెప్పారు. విద్యార్థికి నాణ్యమైన విద్యను అందిస్తూ,  సమాజాన్ని అభివృద్ధి చేసేలా తయారు చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో  స్కూల్​ హెడ్మాస్టర్​ సువర్ణ లక్ష్మి, టీచర్​ స్వర్ణలత, గ్రామపెద్దలు పాల్గొన్నారు. 

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
తూప్రాన్, వెలుగు: రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన మెదక్ జిల్లా తూప్రాన్ మండలం ఘణాపూర్ వద్ద బుధవారం జరిగింది. తూప్రాన్ ఎస్సై తెలిపిన ప్రకారం.. మెదక్​ జిల్లా మాసాయిపేట మండల కేంద్రానికి  చెందిన సాయి (22), కిరణ్ తూప్రాన్ నుంచి గజ్వేల్ వైపు బైక్ పై వెళ్తున్నారు. అల్లాపూర్ దాటగానే వీరు వెళ్తున్న బైక్ అదుపు తప్పి కింద పడిపోయింది.  దీంతో సాయి అక్కడికక్కడే చనిపోయాడు. తీవ్రంగా గాయపడిన కిరణ్​ను హైదరాబాద్​లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.

సుభాష్ రోడ్ లో దుకాణాలు బంద్ 
సిద్దిపేట రూరల్, వెలుగు : అద్దె చెల్లిస్తూ తాము వ్యాపారం చేసుకుంటున్న దుకాణాల ముందు తోపుడుబండ్లు పెట్టి ఇబ్బందులకు గురి చేయడమే కాకుండా,  ప్రశ్నిస్తే దాడులు చేయడాన్ని నిరసిస్తూ బుధవారం సిద్దిపేట సుభాష్​ రోడులోని షాపులన్నీ బంద్​పెట్టారు. ఈ సందర్భంగా సిద్దిపేట చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు ఐత నాగరాజు  మాట్లాడుతూ మంగళవారం రాత్రి సుభాష్ రోడ్ లో తమ షాపు ముందు బండి పక్కకు తీయాలని చెప్పినందుకు పండ్ల బండి యజమాని దుకాణదారుపై దాడి చేయడం అమానుషమన్నారు. విషయం తెలుసుకున్న టూ టౌన్ సీఐ రవికుమార్ సుభాష్​ రోడ్డుకు చేరుకొని బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అంతకుముందు దాడికి పాల్పడిన వ్యక్తిపై టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో దుకాణాల యజమానులు ఫిర్యాదు చేశారు.  కార్యక్రమంలో షాప్ ఓనర్స్​ ప్రసాద్, హరి, గణేశ్, సంజయ్, లక్ష్మణ్, సంజీవ్, మురళీ తదితరులు 
ఉన్నారు. 

1000 మీటర్ల జాతీయ జెండాతో భారీ ర్యాలీ
కోహెడ(హుస్నాబాద్), వెలుగు : ఆజాదీ కా అమృత్ మహోత్సవ్​లో భాగంగా ఆచార్య  జయశంకర్  సేవా సమితి ఆధ్వర్యంలో  బీజేపీ నాయకులు స్టూడెంట్స్​తో కలిసి బుధవారం హుస్నాబాద్​లో 1000 మీటర్ల జాతీయ జెండాతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆచార్య జయశంకర్ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు కందుకూరి జగదీశ్వర్ మాట్లాడుతూ ప్రధాని మోడి పిలుపుమేరకు ప్రతి ఒక్కరిలో దేశభక్తిని రగిల్చేలా జాతీయ జెండాతో భారీ ర్యాలీ నిర్వహించామని తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు విజయ్​పాల్​రెడ్డి, వీరాచారి, అనిల్, రాజిరెడ్డి పాల్గొన్నారు.

ముదిరాజ్ లు ఐక్యంగా ఉద్యమించాలి
జగదేవపూర్(కొమురవెల్లి), వెలుగు : ముదిరాజ్ లు ఐక్యంగా ఉద్యమించి హక్కులను సాధించుకోవాలని నాచారం దేవస్థానం మాజీ చైర్మన్, ముదిరాజ్ సంఘం రాష్ట్ర నాయకుడు కొట్టాల యాదగిరి అన్నారు. బుధవారం జగదేవపూర్ మండల కేంద్రంలో నిర్వహించిన  ముదిరాజ్ సంఘం సమావేశంలో సంఘం మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడిగా జగదేవపూర్ కు చెందిన రాగుల రాజు, ప్రధాన కార్యదర్శులు గా నర్ర సుదర్శన్, రాజపేట చంద్రం,  కోశాధికారిగా కొంపల్లి శీనుతో పాటు కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. 

ఉత్సాహంగా రక్తదానం 
స్వాతంత్ర్య వజ్రోత్సవాల సందర్భంగా బుధవారం ఉమ్మడి జిల్లాలోని పలు చోట్ల రక్తదాన శిబిరాలు నిర్వహించారు. పలువురు నాయకులు, అధికారులు, యవకులు రక్తదానం చేశారు.  సిద్దిపేటలోని మినిస్టర్  క్యాంప్ ఆఫీస్ లో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి హరీశ్​రావు మాట్లాడారు. ఒక్కో నియోజకవర్గంలో  ఒకే రోజు 75 యూనిట్ల చొప్పున రక్త సేకరణ జరిగిందని తెలిపారు. దాత నుంచి సేకరించే రక్తాన్ని కంపోనెంట్ గా వేరు చేసి అవసరమైన వారికి అందిస్తామని, అప్పుడు ఒక్కరి రక్తం ముగ్గురి ప్రాణాలు కాపాడుతుందని వివరించారు. గజ్వేల్​ ప్రభుత్వ ఆస్పత్రిలో సిద్దిపేట జిల్లా కలెక్టర్​ ప్రశాంత్​ జీవన్​ పాటిల్​, సంగారెడ్డి లోని ప్రభుత్వ ఆస్పత్రిలో కలెక్టర్​ డాక్టర్​ శరత్, జిల్లా పోలీస్​ కార్యాలయంలో ఎస్పీ రమణకుమార్, మెదక్​ లోని మాతాశిశు సంరక్షణ కేంద్రంలో అడిషనల్​ కలెక్టర్​ ప్రతిమాసింగ్ రక్తదాన శిబిరాలను ప్రారంభించారు.  నర్సాపూర్, నారాయణఖేడ్​లో ఎమ్మెల్యేలు మదన్​రెడ్డి, భూపాల్​రెడ్డి రక్తదాన శిబిరాలను పరిశీలించారు.  రక్తదానం చేసిన వారికి ప్రశంసా పత్రాలు అందజేసి అభినందించారు.  – వెలుగు, నెట్​వర్క్​

గొల్లపల్లి సొసైటీలో కొత్త గోడౌన్​
కొండాపూర్, వెలుగు : రైతు సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని టీఆర్ఎస్ జిల్లా ప్రెసిడెంట్ చింత ప్రభాకర్ అన్నారు. బుధవారం గొల్లపల్లి  ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆఫీస్ ఆవరణలో 300 మెట్రిక్ టన్నుల గోడౌన్​ నిర్మాణానికి చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి తో కలిసి ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ప్రభాకర్​ మాట్లాడుతూ ఈ గోడౌన్  రైతులకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. దేశంలోనే రైతుల కోసం అహర్నిశలు కృషి చేస్తున్న ఏకైక సీఎం కేసీఆర్  అని అన్నారు. అనంతరం ప్రధాన రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటారు. కార్యక్రమంలో డీసీసీబీ వైస్ చైర్మన్ మాణిక్యం, సీఈవో, శ్రీనివాస్, ఎంపీపీ మనోజ్ రెడ్డి, డైరెక్టర్లు, రైతులు పాల్గొన్నారు.

టేక్మాల్ పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన ఎస్పీ
మెదక్​ (టేక్మాల్), వెలుగు :  టేక్మాల్ పోలీస్ స్టేషన్ ను బుధవారం మెదక్​ ఎస్పీ రోహిణి ప్రియదర్శిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్‌‌‌‌లోని రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ పోలీస్ స్టేషన్‌‌‌‌కు వచ్చే ప్రతీ ఒక్కరిని మర్యాదపూర్వకంగా పలకరించి, వారికి న్యాయం చేసే విధంగా కృషి చేయాలని పోలీసులకు సూచించారు. డయల్ 100 కాల్ వచ్చినప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే సంఘటనా స్థలానికి చేరుకోవాలని ఆదేశించారు. ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఆమె వెంట అల్లాదుర్గం సీఐ జార్జ్, టేక్మాల్ ఎస్సై లింగం ఏఎస్​ఐలు తుక్కయ్య, దయానంద్ ఉన్నారు.

పెండింగ్​ వేతనాలు ఇవ్వండి..సంగారెడ్డిలో మున్సిపల్​ కార్మికుల ధర్నా 
కంది, వెలుగు : వేతనాలు సరిగా అందక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని, వెంటనే పెండింగ్ ​వేతనాలను అందించాలని మున్సిపల్​ కార్మికులు డిమాండ్​చేశారు. బుధవారం సీఐటీయూ నాయకులతో కలిసి సంగారెడ్డి మున్సిపల్ ఆఫీస్​ ఎదుట కార్మికులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి యాదగిరి మాట్లాడుతూ సంగారెడ్డి గ్రేడ్ వన్ మున్సిపాలిటీలో కార్మికులకు వేతనాలు ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం దారుణమన్నారు. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్నా కార్మికులకు మాత్రం పొట్ట నిండడం లేదన్నారు. వెంటనే కార్మికులకు పెండింగ్​ వేతనాలు చెల్లించాలని, లేకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో మున్సిపల్ యూనియన్ నాయకులు వినోద్ కుమార్, వేణు, రాజు, కుమార్, శ్రీనివాస్, రాజేందర్, మల్లేశం, వీరేశం, ముస్తఫా పాల్గొన్నారు.

కొండ పోచమ్మ ఆలయాన్ని అభివృద్ధి చేస్తాం
జగదేవపూర్(కొమురవెల్లి), వెలుగు: సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావు సహకారంతో కొండపోచమ్మ ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామని ఆలయ చైర్మన్ జంబుల శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం కొత్తగా నియమించిన కొండపోచమ్మ ఆలయ చైర్మన్, పాలకమండలి సభ్యులు బాధ్యతలను స్వీకరించారు.  ఈ సందర్భంగా చైర్మన్ తో పాటు పాలకమండలి సభ్యులను ఆలయ ఈవో మోహన్ రెడ్డి, రమేశ్​శాలువాలతో ఘనంగా సత్కరించారు. కొండపోచమ్మ జాతరకు ప్రతిఏటా భక్తుల రద్దీ పెరుగుతున్న దృష్ట్యా భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులు కల్పించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ రజితారమేశ్, ఈవో మోహన్ రెడ్డి, పాలకమండలి సభ్యులు దాచారం కనకయ్య, కనకరెడ్డి, జానకీరాములు, సంతోష్, రామచంద్రారెడ్డి, వెంకట్రాంరెడ్డి, కిషన్ చారి, ఆలయ సిబ్బంది వెంకట్ రెడ్డి, కనకయ్య, హరిబాబు, పూజారులు లక్ష్మణ్, కొండయ్య ఉన్నారు.

ఆర్డీవో ఆఫీసుల ఎదుట వీఆర్ఏల ఆందోళన
తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఉమ్మడి మెదక్​ జిల్లాలోని ఆర్డీవో ఆఫీస్​ల ఎదుట వీఆర్​ఏలు ఆందోళనలు చేపట్టారు. ఆఫీసర్లకు వినతి పత్రాలు అందజేశారు. సంగారెడ్డిలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి సాయిలు, వీఆర్​ఏల సంఘం అధ్యక్షుడు  మురళీధర్ రావు  ములుగులో సంఘం గజ్వేల్​ డివిజన్​ అధ్యక్షుడు నీరూడి ఆంజనేయులు మాట్లాడారు.  గతనెల 25 నుంచి వీఆర్​ఏలు తహసీల్దార్ ఆఫీసుల ఎదుట సమ్మె చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. 
సీఎం కేసీఆర్​ స్వయంగా అసెంబ్లీలో ప్రకటించిన పే స్కేల్ జీవోను వెంటనే విడుదల చేయాలని,  అర్హత కలిగిన వీఆర్ఏలకు ప్రమోషన్లు ఇవ్వాలని డిమాండ్​ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని  హెచ్చరించారు.  
- వెలుగు, నెట్​వర్క్

అథ్లెటిక్​ జిల్లా స్థాయి సెలెక్షన్స్​
మెదక్, వెలుగు : జిల్లా అథ్లెటిక్​ అసోసియేషన్​ ఆధ్వర్యంలో బుధవారం మెదక్ ఇందిరా గాంధీ స్పోర్ట్స్​ స్టేడియంలో స్టేట్  జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ పోటీల కోసం జిల్లాస్థాయి సెలెక్షన్స్​ నిర్వహించారు. సుమారు 500 మంది క్రీడాకారులు హాజరయ్యరు. త్రోస్,  జంప్స్, రన్నింగ్ పోటీలను నిర్వహించి అండర్‌‌‌‌-14, 16, 18,  20  బాల, బాలికల విభాగాల్లో క్రీడాకారులను ఎంపిక చేశారు. ఎంపికైన క్రీడాకారులు ఈ నెల 24 నుంచి మెదక్ లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శి వెంకటరమణ, మధుసూదన్ తెలిపారు. మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి రాజేందర్  పీఈటీలు సుజాత, శ్వేత, సంతోశ్​, చరణ్  పాల్గొన్నారు.